Sunday, December 26, 2010

నాకన్నీ మతికే...

సిన్నప్పుడు యేరుకున్నే పుల్లసింతకాయలు
ఈతకాయలుగట్టుకుని ఈత నేర్సుకున్నే రోజులు..
సరిగా సదువ్ కోల్యా అని మా నాయ్ న పీకిన పీకులు..

నాకన్నీ మతికే...
మాయమ్మ జొన్నగోయబోయి నాకోసం దెచ్చిన శెరుకులు
సీకట్లోనే లేసి ఇసికలో రాసుకున్నే ఓ నా మాలు
గురుపూజకు ఇల్లంబులతో వాకిట్లకు గొట్టిన రంగుబాణాలు..
పీర్లపండక్కు మా ఇంట్లో సేసిన సోంగారెట్టెలు..
కిస్ మస్ కు చర్చీకి తీసకబోయిన శక్కర...
దీపాలపండక్కు కాల్సిన టపాకులు..

నాకన్నీ మతికే....
ఎక్కాలు సరిగా రాయనందుకు సివుడు సార్ బెట్టిన తొడపాశం
ఎన్నపూసట్టాంటి మనసుండే మోహన్ రావ్ సార్ సెప్పిన ఇంగిలీసు పాటం..
రెసిడెన్చల్ బళ్లో రోజొక పరీచ్చ బెట్టేదీ.. మార్కులు తక్కువొచ్చే బర్రతో సావగొట్టేది..
ఇంగంతే.. ఆ తండ్లకు బాగొస్చే చదువుగూడా సంకనాకిబోయినాది..
నాకన్నీమతికే...
నాకిప్పుడికీ అర్థం గాడంల్యా.. ఆ తప్పెవరిదో...
గవర్మెంట్ బడి మాన్పిస్చి రెసిడెన్చల్ బళ్లో సేర్పిస్చిన  మా నాయన్ ద్యా..
ల్యాక అంత లెక్క కర్సుబెట్టినాగూడా సరిగా సదువ్ కోని నాద్యా..
పిల్లోల్లని గూడా సూడకుండా సావబాదిన సార్లద్యా..
యేమోగానీ నాకన్నీ మతికే...

నేపొద్దన్నే పాలుబోయిస్చుకుని వస్చాల్కా మావోళ్ళు..
ఎగస్పార్టీ వోళ్ళు.. మిద్దెలెక్కి బాంబుగుండ్లేసుకుందీ మతికే...
మా ఇండ్లకాన్నే బట్టీలుబెట్టి సారాయిగాంచిందీ..
వాళ్ళకోసం పోలీసోల్లొచ్చింది.. మతికే...
అదేందోగానీ సిన్నప్పుడు యేమైనా గుండెగొట్టుకుంటాది..
యేంజెయ్యాలన్న్యా భయమేస్చాది..
అయ్యేగాదు ఇంగా శానా మతికే...
మా ఇంట్లోవండిన కాయల సంకటి(జొన్న సంగటిల్లో అదొకరకం)..
మాయమ్మ మూకట్లో నలిపిన కారెం...
మాయవ్వ సానికలో బెట్టిన మజ్జిగన్నం..
మాయవ్వకు సాల్దని కసురుకుని, గోసిగోసి పోసిన బెల్లం కాపీ..
నాకన్నీ మతికే...
నాకు గుడ్డల్ల్యాకుంటే.. సాకలోల్లిస్చిన సొక్కా..
కలిగినాంక మా నాయ్ న జపాన్ సిల్క్ గుడ్డతో కుట్టిస్చిన సొక్కా..
మాయవ్వింటికాడ కూకున్నెప్పుడు యేం బువ్వ దిన్నావ్ సిన్నీ...
అని సాకలోల్లు పరాసికంగా అడిగితే..
ఆ బువ్వదిన్న్యా అని సెప్పిన మాటలూ మతికే...

నాకన్నీ మతికే...
ఆ కాలంలో మా వూళ్ళో మెతుకన్నం వండాలన్న్యా... కోన్ని గొయ్యాలన్న్యా..
ఇంటికి సుట్టాలన్నా రావాల్యా... వూళ్ళో పండగన్నా సెయ్యాల్యా..

నాకన్నీ మతికే....
పల్లెల్లో తిన్నే జొన్న సంకటి మతికే..
మేం ప్యాట జేరినాంక తిన్నే షుకూర్ బిరియాని, సిల్లీ సికెన్ లు మతికే...
కాళ్ళకు మెట్లు లేకుండా కంపముల్లలో నడిసింది..
బూట్లేసుకుని కార్లలో తిరిగిందీ..

నాకన్నీ మతికే..
నన్నందరూ భయస్చున్ని అనుకుంటుంటారు..
అయినా భయానికి, ధైర్న్యానికి ఎంటికంతే తేడా...
ఎవడన్నా ఏరా.. అంటే ఏరానాకొ... అనచ్చుగానీ..
బాంబుగుండ్లేసుకుందీ సూసినా.. నరుక్కునిందీ సూసినా...
మొగుళ్ళు సచ్చిన పెండ్లాలనూ సూసినా..
ఇండ్లూ, సేలు పోగొట్టుకుని జైల్లో పన్నే పార్టీలోల్లను సూసినా...

నాకన్నీ మతికే...
అయినా మాకెళ్ళి పిల్లులకు కూడా రోసముంటాది..
శాపకు ఈతనేర్పిస్చినట్లు.. సీమలో పుట్నోళ్ళకు ధైర్న్యం గురించి సెప్పాల్నా...
ఒకర్నొకరు నరుక్కునే గడ్డమీద పుట్నోన్ని భయస్చుడనుకుంటే ఎట్టా..

నాకన్నీ మతికే...
మిడిసిపడి మూన్నాళ్ళకే బోయినోళ్ళను సూసినా..
మంచిగుండి నాన్నాళ్ళు బతికినోళ్ళను సూసినా..
నాకన్నీ మతికే...

-సిన్నిగాడు కలం పేరుతో 2005-డిసెంబర్ 26న ఆంధ్రప్రభ దినపత్రికలో అచ్చయిన కవిత

No comments:

Post a Comment