Wednesday, July 11, 2012
Tuesday, July 3, 2012
సాహిత్యంపై ఛానెళ్ళ నిర్లక్ష్యం
సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడంలోనూ.. సాహితీవేత్తలను ప్రోత్సహించడంలోనూ ‘మీడియా’ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సాహిత్యం పలుప్రక్రియల ద్వారా జనజీవనంలో మమేకం. ఏ యుగంలోనైనా పేద, ధనిక తారతమ్యం లేకుండా సాహిత్యం అందరికీ అవసరమే. మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో మానసిక ఉల్లాసమూ అంతే అవసరము. ఈ అవసరాన్ని అనాదిగా‘కళ’లు తీరుస్తున్నాయి. ఇందులో కవిత్వ కళ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కవిని శాషన కర్త అనడం అతిశయోక్తి కాదు.. ప్రపంచ బాధను తన బాధగా తలకెత్తుకునేవాడే కవి. భాష విస్తృతానికి, చరిత్ర, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందిండానికి సాహిత్యం ఎంతగానో దోహదపడుతుంది. నేటి హైటెక్ యుగంలో సాహిత్యాని చదివే పాఠకుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. సాహిత్య పఠనం వల్ల భాషలో ప్రావీణ్యాన్ని సాంధించవచ్చు. మహత్తర శక్తిగల సాహిత్యాన్ని ‘మీడియా’ కూడా నిర్లక్ష్యం చేయడం మరింత బాధాకరం. గతంలో కేవలం సాహిత్యం కోసమే పత్రికలను నడిపేవారు. అలాంటిది నేటి దినపత్రికల్లో సాహిత్యానికి సముచిత స్థానం కల్పించకపోవడం తమ భాషను తామే అవమానపరచుకున్నట్లే అవుతుంది. ఉన్నంతలో చెప్పుకోదగ్గ విషయమేమంటే.. సర్క్యులేషన్ తక్కువగా ఉన్నా చిన్నపత్రికలు పూర్తిగా ఒక పేజీనీ సాహిత్యానికి కేటాయిస్తున్నాయంటే అభినందనీయం.
ఈ విషయంలో దినపత్రికలతో పోలిస్తే టెలివిజన్ ఛానెళ్ళు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి. వీటికి సెన్షేన్ వార్తల తర్వాత, సినిమాలు, ఫ్యాషన్ షోలు, మాట్లాడ్డం కూడా చేతకానివాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాలు... ఇలా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని చెత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. కవులను, రచయితలను, వారి కవిత్వాన్ని, రచనల గురించి కార్యక్రమాలు ప్రసారం చేస్తే సమాజ అభివృద్ధి, వికాసానికి ఎంతగానో ఉపయోగకరం. నేడు చాలావరకు పత్రికలు, టివి ఛానెళ్ళు సర్క్యులేషన్, రేటింగ్ పెంచుకోవడం కోసం పాకులాడుతున్నాయేగానీ... సమాజానికి మంచి చేస్తున్నామా..? చెడు చేస్తున్నామా..? అని ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియాగానీ ఆలోచించడం లేదు. అత్యధిక సర్క్యులేషన్‌గల దినపతివ్రిలు కూడా సినిమా పేజీల్లో అసభ్యకర శీర్షికలతో వార్తలు రాస్తున్నారు.. ఇటీవల దినపత్రికల్లోని సినిమా పేజీల్లో వస్తున్న శీర్షికలు ఇలా ఉంటున్నాయి.. “హీరో యిన్లకు అవి లేవు” . ఏవి లేవు..? ఆ అనుభవం మరువలేనిది...? ఎందుకోసం ఇలాంటివి రాస్తున్నారు.. సమాజంలో కొందరు బాధ్యతల్లేని వ్యక్తులు రకరకాల వికృత, వింత పోకడలను అనుసరిస్తుంటారు.. బాధ్యతాయుతమైన మీడియా కూడా అలాంటి బాటలో నడవడం చాలా దారుణమైన విషయం. ప్రింట్/ఎలక్ట్రానిక్ ‘మీడియా’ సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయడమంటే.. సమాజాన్ని పరోక్షంగా పాతాళానికి నెట్టేసినట్లే.. మహోన్నతమైన, ఆదర్శవంతమైన, అత్యుత్తమమైన రచయితలగురించి నేట్బి సమాజంలో ఎంతమందికి తెలుసు. ప్రముఖ కవులను గానీ.. ప్రముఖ జాతీయ నాయకులను గానీ నేడు ఎంతమంది గుర్తించే స్థితిలో ఉన్నారు..
వీటికి సమాధానాలు తెలిస్తే ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి. కనీసం ఈ మాట కూడా చాలా మందికి తెలియదు. నేటి రాజకీయ నాయకులు చేస్తున్నదే గదుల్బాజీ పనులు... అది చాలదన్నట్లు ఛానెళ్ళలో గంటలు తరబడి పనికిరాని, ప్రయోజనం లేని చర్చా కార్యక్రమాలు. వీటివల్ల వీసమెత్తు ఉపయోగమైనా ఉంటోందా..? సమాజంలోని దురాచారాలు, కుసంస్కృతి, లంచగొండితనం, అంటరానితనం, వరకట్నం.. ఇలా సమాజానికి చీడలాంటి విషయాలమీద ఎంతోమంది మహానుభావులు తమ రచనల ద్వారా పోరాడారు. తద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించారు. ఇప్పటి యువతలో చాలా మందికి లేఖ రాయడమే చేతగాదు. అలాంటిది రచనలో ఎన్నెన్ని ప్రక్రియలున్నాయి.. భాషను ఎలా మలుచుకుని, ఎలాంటి రచనలు చేయొచ్చు అన్న విషయాలు బొత్తిగా తెలియదు. మహాద్భుతమైన రచలు అందించిన రచయితల్లో.. సుతిమెత్తగా మొహం మీద మొత్తినట్లు కొందరు రాస్తే.. నీళ్ళు నమలకుండా సూటిగా ముఖం మీద గుద్దినట్టు రాసినవారు కొందరైతే.. వ్యంగ్యంతో వెక్కిరించినవారు, నవ్విస్తూనే.. ఏడ్పించే వారు .. తప్పుడు పనులు చేసినోళ్ళకు పరువుతోపాటు ప్రాణం పోయేవంటి రచనలు చేసిన ఆదర్శ రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి మనం జన్మజన్మలకు రుణపడి ఉంటాం.. అంతటి రచనా సామర్థ్యం, సత్తా, చేవ మనకు లేకపోయినా ఫర్వాలేదుగానీ... కనీసం అలాంటి అమూల్యమైన ‘సాహితీ సంపదను’ కూడా కాపాడుకోలేకపోతున్నామంటే.. క్షమించారని నేరం.. మనందరం సిగ్గుతో తలదించుకోవాలి.
ఓడి గెలుస్తారా..? గెలిచి ఓడిస్తారా..?
ఆట ఎప్పుడు మొదలైందో.. ఎలా మొదలైందో సామాన్యులకు అర్థం కావడం లేదుగానీ.. రాజకీయ చదరంగం మాత్రం రసకందాయంలో పడింది. ఒక్కడి మీద యుద్ధానికి వంద మంది సైన్యం కాలు దువ్వుతున్నారు. అక్షరాలా మహా భారత యుద్ధాన్ని తలపిస్తోంది. అదేదో కాదు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కొనసాగిస్తున్న దాడి.. నిజంగా ఇది హస్తినకు.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న యుద్దంగా అభివర్ణించినా అతిశయోక్తి కాదు... తప్పొప్పులు దోషులకెరుక.. పాపం పుణ్యం దేవుళ్ళకెరుక..! గతంలో తెరవెనుక ఏంజరిగిందో ఖచ్చితంగా ఎవ్వరికీ అంతుబట్టని విషయం. కానీ ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే.. ఇది ముమ్మాటికీ కక్ష్య సాధింపు చర్యేనని ఎంతటి అమాయకున్ని అడిగినా చెప్పేస్తాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జగన్ కలియుగ అభిమన్యుడిలా కనిపిస్తున్నాడు. దీనికి ఉప ఎన్నికల ఫలితాలే కొలమానంగా చెప్పుకోవచ్చు. వీటిని చాలామంది సెంటిమెంట్‌గా కొట్టి పారేస్తున్నారు కానీ.. తండ్రి వల్ల వచ్చిన సానుభూతి యాభై శాతం ఉంటే... కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన అణచివేతల చర్యలవ్ల అది వంత శాతానికి చేరింది.. సానుభూతి కాస్తా ముదిరి అభిమానంగా మారిపోయింది.
కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ఈ యుద్ధం జగన్ దగ్గర నుంచి ప్రారంభించినట్లుగా కనిపిస్తున్నా... వాస్తవానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డినుంచే ప్రారంభించేందేమో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం వెనుకు కుట్ర ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను కూడా అంత ఆశామాషీగా కొట్టిపారేయడానికీ లేదు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలుగానీ.. ఇటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబీకులు గానీ అసలు విషయాన్ని బయట పెట్టకుండానే ముసుగులో గుద్దులాటలాగా వారిలో వారు పోరాడుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్‌తోపాటు ప్రతి పక్ష పార్టీలు, సిబిఐ వారు ఆరోపిస్తున్నట్లుగా వైఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగితే జరిగి ఉండొచ్చేమోగానీ.. ప్రజలు మాత్రం వాటికి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడంలేదు. నేటి రాజకీయాల్లోనూ.. ముఖ్యమంత్రులుగా చేసిన నేతల్లోనూ అవినీతి మలినం అంటని వారెవ్వరూ లేరని.. అలాంటి వారితో పోల్చినా, వైఎస్ తాను దోచుకున్నదంతా దాచుకోకుండా కొంతలో కొంతైనా పంచడంలో అందరికంటే మేలైనవాడనే అభిప్రాయమూ ప్రజల్లో వ్యక్తమవుతోంది. వందేళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీ తమకు ఎదురుతిరిగిన మహామహులనే దారికి తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇందుకోసం సామదానబేద దండోపాయలును ప్రయోగించడంలో కాంగ్రెస్ పార్టీ పేరు గడించింది. అంతటి ఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి జగన్ విషయంలో మాత్రం తన పాచికలు సక్రమంగా పారడంలేదనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తెలివిగా యోచిస్తోందో..? లేక దిక్కు తోచని స్థితిలో ఇష్టానుసారం వ్యవహరిస్తోందో... అర్థం కావడం లేదు. దీన్ని తెలివిగా అర్థం చేసుకోవాలా..? లేక అతి తెలివిగా ఊహించుకోవాలో..? విశ్లేషకుల కూడా అంతుచిక్కడం లేదు. ఏదేమైనా ‘జీరో’ లాంటి జగన్‌కు మాత్రం దేశవ్యాప్తంగా ‘హీరో’ ఇమేజ్ తెచ్చిపెట్టడంలో కాంగ్రెస్ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉంది. వాస్తవానికి కాంగ్రెస్‌తో విబేధించిన వారు చాలా మందే ఉన్నా.. ఎదురించి నిలబడిన వాళ్ళు మాత్రం అరుదే..! కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలో మార్పు రాకుంటే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కానీ, తన తల్లినిగానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక వేళ భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి అయితే తన తండ్రిలాగే ప్రజాదరణ పొందుతాడా..? లేక రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని కొనసాగిస్తాడా..? అన్నది ఇప్పుడే తేల్చలేని విషయం.. పాతకాలపు
ఫ్యాక్షన్ బాటలో కాకపోయినా.. తాననుకున్నది సాధించడంకోసం సైలెంట్ కిల్లర్‌గా తనపనులు తాను చేసుకుపోవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌తో జగన్ చేస్తున్న పోరాటం.. బలవంతుడితో బలహీనుడు తలపడినట్లు తలపిస్తోంది.. ఇలాంటి పోరులో బలహీనుడు గెలిస్తే అతిపెద్ద విజయం.. ఓడితే నైతిక విజయం.. మొత్తానికి జగన్ మాత్రం కొండకు వెంట్రుక వేసి లాగుతున్నాడు... వస్తే కొండ, పోతే వెంట్రుక.. అదే గెలుపు తిరగబడితే.. అతిపెద్ద జాతీయ పార్టీ ఘనచరిత్రను కట్టుకున్న మూటలోనే ఈ పరాభావాన్ని మూటగట్టుకోకతప్పదు..!
Subscribe to:
Posts (Atom)