Saturday, June 30, 2012

‘కాలమ్.. జ్ఞానమ్’ కామెడీగా




‘కాలమ్’ కొద్దీ రాసే రచయితలున్నా.. రచనలకు ఇది అంతగా సరైన కాలం కాదు. ఎందుకంటే దిన పత్రికల్లోని శీర్షికలు చదవడానికే ఎవరికీ తీరిక లేని కాలం ఇది. అలాంటిది సీరియస్ రచనలనో.. జ్ఞానం కలిగించే రచనలనో చదివేవారు చాలా తక్కువ.  కొంతలో కొంత సంతృప్తికరం ఏంటంటే..  ‘వ్యంగ్యం’ అంటించి రాస్తే  సమయం, సరదా లేనివారు కూడా వదలకుండా చదివే  అవకాశం ఉంటుంది.  

శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానమ్ ఎంతటి ప్రాశస్త్యమైందో తెలిసిందే. అంత విస్తృతంగా కాకపోయినా అంతే ‘దూర’, ‘దివ్య’ దృష్టితో కామెడీ  కాలజ్ఞాన్ని రాశారు దురికి మోహన్ రావుగారు. ఆయన రాసిన కామెడీ కాలజ్ఞానం చదివిన వారెవ్వరికైనా ఆయన్ను ముద్దుగా శ్రీశ్రీశ్రీ  కలియుగ వీరబ్రహ్మాండ స్వామి అని పిలవాలనిపిస్తుంది. దురికి  మోహన్‌రావుగారు చాలా సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ, కొన్నింటికి స్ట్రైట్‌గానూ పనిచేశారు. ఆయన గతంలో రాసిన ‘సన్నకారు ప్రేమికులు’  అప్పట్లో సంచలనం.  అమెరికా సంస్కృతి నేపథ్యంగా ఆంగ్లంలో రాసిన ఎక్స్ రే మ్యాన్ ఇప్పట్లో మరింత సంచలనం. ప్రపంచ వ్యాప్తంగా  పేరు మోగినరావ్ తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం.  ఈయన సాహిత్యంలో పలు ప్రక్రియల్లో కలంతిరిగిన రచయిత అనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.  కామెడీ కాలజ్ఞానం అనే పేరు చూడగానే ఇదేదో చౌకబారు రచనేమో అనుకున్నా.. కానీ సార్థక నామధేయం అన్నట్లుగా ఈ పుస్తకానికి ఆపేరు అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. కామెడీ అన్నదిపేరులోనే కాకుండా రచనల్లో కూడా చివరి దాకా  పడిపడి నవ్వుకునేలా చేస్తుంది.  సాక్షి ఆదివారం అనుబంధంలో  కాలమ్‌గా వచ్చిన ఈ రచనలు  భవిష్యత్ కాలాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఇకపోతే జ్ఞానం..  టెక్నాలజీ అభివృద్ధి చెందితే సమాజంలో, సంస్కృతిలో, వ్యక్తుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పులొస్తాయి అనే విషయాలను  పెద్దగా  చదువుకోని వారికి కూడా అర్థమయ్యేలా  దివ్యమైన దూరదృష్టితో రాశారు. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ‘ఆదిత్య ౩౬౯’  సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఒక శాస్త్రవేత్త  కాలయంత్రం (టెమ్ మిషిన్) ను కనిపెడతాడు. దాని ద్వారా భూత, భవిష్యత్ కాలాల్లోకి ప్రయాణించ వచ్చు.  కృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళి రావచ్చు, ౨౦౫౦ సంవత్సరంలోకి ప్రయాణించవచ్చ్చు. ఐతే ఆదిత్య ౩౬౯కు కామెడీ కాలజ్ఞానికి చాలా తేడా ఉంది. ఆ సినిమా సీరియస్‌గానూ, ఉత్కంఠగానూ సాగితే.. ఈ రచన నవ్వుపుట్టేలా, ఆనందంగా.. ఆహ్లాదంగా చదివిస్తుంది.  ఇవన్నీ దురికిగారు మేథాశక్తితో ఊహించి (ఇమాజినేషన్)  రాసిన ఫిక్షన్ అయినా  ఏమాత్రం వాస్తవ దూరం కాదనిపిస్తుంది. ఉదా- ‘శ్మశానంలో ఇల్లు’ అన్న శీర్షికతో భవిష్యత్‌లో హైదరాబాద్‌లో జనావాసాలు ఎలా ఉంటాయో చూపించాడు.  ఈ విషయంలో అయితే ౨౦౫౦ వరకు కూడా అక్కర్లేదు, ఆ దృశ్యం ఇప్పుడే కనిపిస్తోంది. ఎక్కడంటారా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెం-౧౨కు వెళ్తే చాలు. సమాధుల దగ్గర ఇల్లు కట్టారో..? ఇళ్ళ దగ్గర సమాధులు కట్టారో..? తేల్చుకోవడం అంత తేలిక కాదు. అలాగే   ‘దేశ భాషలందు తెలుగు ‘లెస్సు’ అంటూ రాబోయే కాలంలో తెలుగుకు ఎలా తెగులు పడుతుందో అద్దంలో చూపినట్లు రాశాడు.  ఈ విషయంలో కూడా ౨౦౫౦ వరకూ అక్కర్లేదు ఇప్పటికే తెలుగు భాషకు పట్టాల్సినంత తెగులు పట్టేసింది. తియ్యటి తెలుగులో అమ్మా నాన్నా, అవ్వ తాత, అని పిలవాలన్నా, పిలుపించుకోవాలన్నా కూడా నా మోషీగా అనుకునే వారెందరో ఉన్నారు. అంతెందుకు ఇప్పటితరంలో ఒక్క ఐదు నిమిషాలు ఏ ఒక్క ఇంగ్లీషు పదంలేకుండా మాట్లాడమంటే  చాలా మందికి నోరు రాదు. అలాగని పూర్తిగా ఇంగ్లీషులో మాట్లాడమన్నా చేతకాదు. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది పరిస్థితి.  ఉదాహరణకు.. ఒక ఆర్టీసి బస్సు మీద చూస్తే.. ప్రొద్దుటూరు అనే ఊరు పేరును ప్రోద్దుటూరు అని రాసుంది. ఇంకో వీధిలో చూస్తే ఇచ్చట ఊచ్చలు పోస్తే చేప్పుతో కొట్టబడను.   మన భాష, సంస్కృతి ఎంతగా అడుగంటి పోతున్నాయో తెలిపే మరో ఉదాహరణ. నేనో టివి ఛానెల్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి రాసిన పుస్తకం ‘పరికిణి’ కొన్నాను. అదే ఛానెల్‌లో పనిచేస్తున్న ఒకమ్మాయి చూసి అదేంపుస్తకం అనడిగితే, పరికిణి అని చెప్పాను అంటే ఏంటి అనడిగింది. ఆ ప్రశ్న వినగానే నాకు కోపం, ఆశ్చర్యం, జాలి, బాధ అన్నీ ఏకకాలంలోనే కలిగాయి. తెలుగమ్మాయి అయ్యుండీ పరికిణి అంటే తెలియనందుకే కోపం. ఆమె అమెరికాలో పెరిగిందీ కాదు, మహానగరంలో పుట్టిందీ కాదు. సాధారణ పట్టణం నుంచి ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చింది. రేపో మాపో పెళ్ళి కాబోయే  తెలుగమ్మాయికి పరికిణి అంటే తెలియనందుకు జాలి.  ఇవి చూడ్డానికి చిన్న విషయాలుగానే కనిపించొచ్చు కానీ.. ఇది ఊహించుకుంటే ఒక్కోసారి భయమేస్తుంది.
 నిజంగా ఈ పరిణామం ఎటు దారి తీస్తుందా అని.  తెలుగు నేలమీద, తెలుగు వారికి మాతృ భాషలో సంపూర్ణంగా రాయడం, మట్లాడ్డం రావడం లేదంటే ఇంతకంటే భాషా దౌర్భాగ్యం ఎక్కడా ఉండదు.  ౨౦౫౦లో  తెలుగు  భాషా మరెంత దరిద్రంగా తయారవతుందనేది దేశ భాషలందు తెలుగు ‘లెస్సు’  అనే శీర్శికన అద్భుతంగా రాశారు. అందులో ఒక చోట శోభనం రాత్రి ‘శృంగార నైషధం’ గ్రంథంలోని ఒక పద్యాన్ని పాడమని భర్త అడిగితే బదులుగా  అతని భార్య  చెప్పే సమాధానం ఇలా ఉంటుంది.. ‘నేను ఆ నేమ్ హియర్ చేయలేదు యార్, అయినా వాటీస్ దిస్ నాన్సెన్స్ పద్యాలు’ అంటుంది చిరాకుగా.  ఈ ఒక్క వాక్యంతోనే అర్థమవుతుంది మన భాష, సంస్కృతి ఏ స్థాయిలో ఉండబోతున్నాయో.. ఇకపోతే ఇంటి పనిమనుషుల గురించి రాసింది ఆలిండియా అంట్లు తోమే వాళ్ళ సంఘం. ఇప్పుడే నమ్మకంగా, చక్కగా పని చేసే మనుషులు దొరకడం కష్టసాధ్యంగా ఉంది. ఇక భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది చాలా బాగా రాశారు.  ఇలా చెప్పుకుంటూ పోతే దురికి గారు రాసిన పుస్తకమంత అవుతుంది. ఐనా ఒక్క మెతుకుతోనే తెలిసిపోతుంది కదా అన్నం ఉడికిందీ లేనిదీ.. అన్నింటి గురించి చెప్పడమెందుకు. ఐతే ఈ పుస్తకంలో కెవ్వున అరవడం, ఉలిక్కిపడడం, హీనంగా, ధీనంగా, హీనాతి హీనంగా, ధీనాతి ధీనంగా, గిర్రున బుర్ర తిరగడం వంటి పదాలు సందర్భానుసారంగానే అయినా పదేపదే రావడంతో కొద్దిగా విసుగు అనిపిస్తుంది. ఇది మినహా వేరే ఏ ఇబ్బందీ లేదు..
హెచ్చరిక- ఈ పుస్తకం పట్టుకోవడం వరకే మీ చేతుల్లో ఉంటుంది.. వదలడం మీ వల్ల కాదు.. పూర్తిగా చదివే వరకూ.  అంతేకాదండోయ్ వ్యంగ్యం వ్యసనం లాంటిది.. మిమ్మల్నే కాదు.. మీ చుట్టుపక్కల వారిని కూడా బానిసలుగా చేస్తుంది. నేను చెప్పాలనుకున్నది చెప్పాను.. తర్వాత మీ ఇష్టం..  -నవకలం

Wednesday, June 6, 2012

అంతమౌతున్న ‘అపురూపజన్మ’



ప్రేమ, దయ, కరుణ, ఓర్పు, సహనం వీటన్నింటి కలయికే ‘స్త్రీ’. స్త్రీలను దేవతలుగా కొలిచినట్లు పురాణ, ఇతిహాసాలు చాటుతున్నాయి. ఇలాంటివన్నీ కాకమ్మకథలుగా కొట్టిపారేసినా.. రాణి రుద్రమ దేవి, ఝాన్సీలక్ష్మీభాయి వంటి వీర నారీమణుల విజయగాథలు ఎవరూ కాదనలేని చారిత్రక సత్యాలు. ఈ సృష్టిలో మహిళకు సాటిరాగల ప్రత్యామ్నాయమేదీ లేదు. తల్లిగా, చెల్లిగా, ఆలిగా ప్రేమ పంచడంలో ఆమెకు ఆమే సాటి. ఏ రూపంలోనైనా అమితమైన అభిమానం చూపే స్త్రీ.. ఇంటి పరువు కాపాడ్డానికి అదే స్థాయిలో శక్తి సామర్థ్యం, సహనాన్ని చూపే స్త్రీ, తేడా వస్తే అపర కాళికా శక్తిలా తన విశ్వరూపాన్ని ప్రదర్శించగలదు. అలాంటి స్త్రీ మూర్తిని మనం దేవతలా పూజించకపోయినా, కనీసం సాటి మనిషిగా కూడా చూడలేకున్నాం. మనుషులుగా మనం  ఆధునికంగా ఎంత ఎత్తుకు ఎదిగామో... మానవత్వం విషయంలో అంతకు పదిరెట్లు దిగజారిపోతున్నాం. ఆడవాళ్ళు మగవారితో అన్నింటా సమానం.. వారికి సమాన హక్కులు అంటూ రాజకీయ నాయకులు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు వినడానికి చక్కగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం సున్నా. ఎక్కడిదాకో ఎందుకు.. ఆర్టీసి బస్సుల్లో ఆడవారికి కేటాయించిన సీట్లలో కూర్చున్న మగవారిని  వాళ్ళు గద్దించి అడిగితేగానీ  లేవడం లేదు.
 మనిషి  ఈ సృష్టిలోని ఏఒక్కదాన్నైనా కూడా నాశనం చేసి, తానొక్కడే మనుగడ సాగించాలనుకోవడం దుర్లభం.. దురాలోచన అవుతుంది. ఇది గ్రహించలేకనే తన జన్మకు కారణమైన, ప్రకృతిలోనూ, జీవనంలోనూ తనతో సమానమైన ఆడజన్మనే అంతం చేయడానికి కంకణం కట్టుకుంది నేటి సమాజం. కొందరు పురిటినుంచే కాటికి పంపుతుంటే.. మరి కొందరు కడుపులోనే కరిగించేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నాం.. ఎందుకిలా జరుగుతోందన్న విషయం ఏ ఒక్కరూ ఆలోచించడంలేదు. దీనివల్ల ఎంతటి దుష్పరిణామాలు ఎదురవుతాయో కూడా ఆలోచించడం లేదు. అనాదిగా  మన సంస్కృతిలో ఆడవారంటేనే ఒక చులకన భావన పాతుకుపోయి ఉంది. నిజానికి  చెప్పాలంటే ఆడమనిషి అంటే.. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన భావనలున్నాయి. కొందరికి విలాసం, భోగవస్తువుగా ఉంటే.. ఇంకొందరికి పనిమనిషి.. ఇప్పటికీ చాలా మందికి భార్య అంటే జీవిత భాగస్వామి కాదు, ఆమె ఒక బానిస. ఆడవారి పుట్టుకే మగవారితో పోలిస్తే చాలా భిన్నమైంది. వారి శరీరతత్వం ప్రత్యేకమైంది. ఆడవారిని ఆమడ దూరంలో ఉంచుతుండడానికి ఈ అంశాలు కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా ఆడపిల్లల సంఖ్య గణనీయంగా క్షీణించిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ౨౦౧౧సంవత్సరం సేకరించిన లెక్కల ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా మగవారితో పోల్చితే మహిళల నిష్పత్తి దారుణంగా పడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే దాదాపు ౧౮శాతం తేడా ఉంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్న చందంగా ఆడజాతి అంతమొందుతుండడానికి కూడా అన్నే కారణాలున్నాయి. ఈ పాపంలో సమాజంలోని అందరూ భాగస్వాములే. ఈ విషయంలో ప్రధానంగా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. మొదట ఆడపిల్లల్ని కనే విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడంలోనే విఫలమైందని చెప్పాలి. తర్వాత ఆడపిల్లలను పిండదశలోనే చంపేస్తుండడానికి స్కానింగ్ సెంటర్లదే ప్రముఖ పాత్ర. వీటిని కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమౌతూనే ఉంది. దేశంలోని ఏమూల చూసినా మహిళలకు భద్రత శూన్యం. పుట్టినప్పటినుంచి పెళ్ళయ్యే వరకూ వారికి ఏవిధమైన రక్షణ, భరోసా ఉండడం లేదు. ఇదే  మన ఆంధ్రద్రేశ్‌లోనే.. ఉన్నతపాఠశాల్లో చదివే అమ్మాయిలకు బడిలో మరుగుదొడ్లు లేక, ఆరుబయటే బహిర్భూమికి వెళ్తున్న దుస్థితి ఎన్నో జిల్లాల్లో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితే మన పాలకుల, ప్రభుత్వాధికారుల పిల్లలకు ఎదురైనా కూడా ఇలాగే గుడ్లప్పగించి చూస్తూ ఊరుకుంటారా..? ఎవరి పిల్లలైనా పిల్లలే.. కోటీశ్వరులకైనా.. కూటికిలేని వారికైనా సిగ్గు సిగ్గే..! సిగ్గుమాలిన పనులు మనం చేస్తూ.. నిందలు మహిళలపైనా..? తప్పులు మనం చేస్తూ.. పసిప్రాయంలోనే ఆడ పిల్లలను శిక్షించడం న్యాయమా..? మహోన్నతమైన స్త్రీ మూర్తిని హత్య చేస్తున్న నేరంలో కుటుంబం, సమాజం, ప్రభుత్వం అందరూ దోషులే.. ఇప్పుడు చేస్తున్న తప్పులకు భవిష్యత్తులో కఠినశిక్ష అనుభవించక తప్పదు. ముందు తరాలవారు  తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఆడపిల్లంటే నెత్తిమీద కుంపటి కాదు.. ఆణిముత్యం. ఆడ జన్మ అపురూప జన్మ..

మూగ రోధన..!



మనుషులు రానురాను రాక్షసుల్లా మారిపోతున్నారు. విద్యరాక ముందు వినయంగా ఉండి.. విద్య నేర్చాక వింతపశువుల్లా ప్రవర్తిస్తున్నట్టుంది. ఆధునికంగా ఎంత ఎత్తుకు ఎదుగుతున్నామో   మనిషులుగా అంతకంత దిగజారిపోతున్నాం. మనుషుల రాక్షసత్వానికి తల్లిలాంటి ప్రకృతి విలవిల్లాడిపోతోంది. ప్రకృతి మూగరోధనను ఆలకించే మనసున్న మనుషులే కనిపించడం లేదు. ప్రకృతిలోని సమస్తానికి తానే అధిపతిని అన్నట్లుగా ఉంది మనిషి వ్యవహారం. మనిషి ఉనికికి ఎంత ప్రాధాన్యముందో.. ప్రకృతిలోని అన్నింటికీ అంతే ప్రాధాన్యముంది. భూమి, చెట్టు, నీరు, రాయితోపాటు సమస్త ప్రాణికోటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. వాటన్నిటికంటే మనలో ఉన్న ప్రత్యేకత తెలివి. దీనివల్ల గర్వం తలకెక్కకుండా హుందాగాను, మంచికి పాటుపడేలాగా వ్యవహిరించాలి. అదేదో గొప్పగానో, అధికారంగానో భావించడం చాలా ప్రమాదకరం. నేటి ఆధునిక యుగంలో సమాజం ముందు చూపు లేకుండా క్షణికానందాలకు, పైపైమెరుగులకే ప్రాధాన్యమిస్తోంది. దీనివల్ల ప్రకృతిలో సహజసిద్ధంగా లభించేవన్నీ అంగట్లో సరకుల్లాగా కొనుక్కుంటున్నారు. పైకి ఎంతందంగా కనిపించినా ప్లాస్టిక్ పువ్వు సహజమైన పువ్వు ల్లాగా సువాసన వెదజల్లలేదు. సహజమైనవాటిని నాశనం చేస్తూ.. ప్రత్యామ్నాయంగా ప్రతిఒక్క దాన్ని కొనుక్కుంటూనే ఉన్నారు. వ్యాయామం నుంచి నవ్వుని కొనుక్కునే విపరీత కాలం దాపురించి. అంగడికెళ్ళి పాల ప్యాకెట్ తేవడానికి కూడా బద్దకించే వారు.. జిమ్‌లకు వెళ్ళి డబ్బు పెట్టి మరీ వ్యాయామం చేస్తున్నారు. చేయాల్సిన అన్నిపనులకూ ఆటోలు,  బైక్‌లు, బస్సుల మీద వెళ్ళడం... ఉదయం సాయంత్రం ఇంటిల్లిపాది వాకింగ్, జాగింగ్ చేయడం. సహజంగా జరగాల్సినవన్నీ వికృతంగా ఎందుకు జరుగుతున్నాయో ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా..? మొత్తం మనిషి జీవితచక్రమే అస్తవ్యస్తంగా మారిపోయింది. మనుషులు ఆనందంగా, హాయిగా బతకాలనుకోవడం తప్పు కాదు.. కానీ అది పరిసరాలను నాశనం చేసి మనం పొందేది సుఖం కాజాలదు. ఈవిధంగా తాత్కాలికంగా సుఖ భోగాలు అనుభవించినా భవిష్యత్తులో ప్రళయాలను ఎదుర్కోక తప్పదు. మనిషి ప్రతి విషయాన్ని వ్యాపార దృక్కోణంలోనే చూస్తున్నాడు. చెట్టు, పుట్ట, రాయి రప్పల గురించి మనుషుల రాతిహృదయాలకు అర్థం కాకపోయినా.. కనీసం ముద్దులొలికే పక్షులు, చిన్నిచిన్ని జంతువులను కూడా వ్యాపార వస్తువుల్లాగే చూస్తున్నామంటే మనల్ని మనుషులని పిలవాలా..? లేక రాక్షసులనాలా..? వన్యప్రాణుల్ని విచక్షణా రహితంగా వేటాడుతున్నారు. కొన్ని పక్షుల, జంతువుల మాంసాన్ని విందు, వినోదాలలో వడ్డించడం గొప్పతనంగా భావించే సంపన్నులు ఎందరో ఉన్నారు. జింక, కుందేలు, నెమళ్ళు ఎంతో చూడముచ్చటగా ఉండే చిరు ప్రాణులు. వాటిని ఎంతగా హింసించినా ప్రతిఘటించలేని సాధు ప్రాణులు. మయూరాలకు మన సంస్కృతిలోనూ, ప్రకృతిలోనూ ప్రత్యేక స్థానం ఉంది. అది  మన జాతీయ పక్షి కూడాను. మయూరాలు పురి విప్పి నర్తించే సుందర, మనోహర దృశ్యాన్ని వర్ణించడానికి ఏ ప్రపంచంలోని ఏ భాషా సరిపోదు. అలాంటి మయూరాలను ఈకలకోసం మట్టుబెడుతున్నారు నేడు. సహజసిద్ధమైన అందాలను అమ్ముకుంటూ.. ఆసొమ్ముతో విపత్తులను కొని తెచ్చుకుంటున్నాం.
ఆలోచించే తెలివిలేని, వేరే విధంగా ఆహారాన్ని సంపాదించుకుని శక్తి యుక్తులులేని క్రూర మృగాలు మాత్రమే వేట మీద ఆధారపడతాయి. అన్ని విధాలా శక్తివంతులమైన  మనుషులం క్రూరమృగాల బాటన నడవడం నాగరికమా..? అనాగరికమా..? మనకు మనం ఒక్కసారి ప్రశ్నిచుకోవాల్సిన తరుణం ఇది. వన్యప్రాణి చట్టాలు, అటవీ చట్టాలు ఉన్నా కూడా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ధనవంతులు, స్మగ్లర్ల దృష్టిలో అవన్నీ చిత్తుకాగితాలతో సమానం. విస్తారంగా చెట్లు పెంచే సంస్కృతి అంతరించిపోయింది. వృక్షాలుగా పెంచాల్సింది పోయి కుండీల్లో కుదించే పరిస్థితి వచ్చింది. ఇష్టారీతిగా గనులను తవ్వేస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి విపత్కర పరిణామాలకు దారి తీస్తాయో ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. పూర్వం అనామకులు ఇంటికొచ్చినా మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొనుక్కుని తాగే దుస్థితిలో బతుకుతున్నాం. వీటన్నింటికి కారణం మనుషులు చేస్తున్న వికృత చేష్టలే. తల్లివంటి ప్రకృతిని బాధ పెట్టే ఏ బిడ్డా బాగుపడడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమనేది నానుడి.. కానీ మనకు పట్టుకోవడానికి ఆ ఆకులు కూడా మిగిలేలా లేవు.!

దేవుళ్ళను కూడా కొనేస్తారేమో..!?




ఆస్తికులు, నాస్తికులు అన్న తేడా లేకుండా ప్రజలంతా దేవుడి మీద భారమేసి బతకాల్సిన రోజులు దాపురించాయి. అసలు దేవుడు ఉన్నాడా..? లేడా...? అన్నది పశ్న్రే కాదిప్పుడు. ఉంటేగింటే  కనీసం ఆదేవుడైనా డబ్బుకు అమ్ముడుపోకుండా ఉంటాడా..? అన్నదే అసలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష దైవాలుగా భావించే చట్టం, న్యాయాలకే సంకెళ్ళు పడుతుంటే.. సామాన్యుల గుండెల్లో పిడుగులు పడ్డట్టుంది. కాపాడాల్సిన దేవుళ్ళే కాటేస్తుంటే.. సామాన్యుల గోడు ఎవరికి చెప్పుకోవాలి..? న్యాయం కూడా అంగడి సరకైపోతే నిరుపేదల పరిస్థితి ఏంటి..? మన భారత దేశంలో బహిరంగంగా చెప్పుకోవడానికే ప్రజాస్వామ్యం.. తెరవెనుక నడుస్తున్నదంతా ‘ధనస్వామ్య’మే..! క్యాన్సర్ లాంటి  లంచం ప్యూన్లు, అటెండర్ల స్థాయినుంచి ఐఎఎస్, ఐపిఎస్‌ల దాకా పాకింది. ఐతే సమాజంలోని అన్ని రంగాలూ భ్రష్టుపట్టిపోయినా.. న్యాయం మాత్రం నిప్పులాగే ఉందన్న నమ్మకం, ధైర్యం సామాన్య ప్రజల్లో ఇప్పటివరకూ సడలిపోలేదు. కానీ నేడు నిప్పుకూ చెదలు పట్టింది. న్యాయానికే సంకెళ్ళు పడ్డాయన్న  విషయం వెన్నులో భయం పుట్టిస్తోంది. కాలికింది భూమి కంపించినట్లుంది. ఏకాలంలోనైనా సమాజం నీతి, న్యాయం, నమ్మకం అనే పునాదులమీదే కొనసాగుతుంది. ఆ పునాదులే బీటలు వారితే నిట్టనిలువునా కుప్పకూలిపోతుంది. రాజులకాలపు తీర్పులైనా, రచ్చబండ తీర్పులైనా అవే ప్రాతిపదికగా ఉండేవి.
న్యాయమూర్తులే కటకటాల్లోకెళ్తున్న పరిస్థితుల్లో జేబుదొంగలను, బంధిపోట్లను నిందించేందుకు, శిక్షించేందుకు ప్రజలకుగానీ.. పాలకులకుగానీ వీసమెత్తు అర్హత కూడా లేదు. ఎలాంటి నేరాలకు పాల్పడిన నేరస్థులైనా పరిస్థితుల ప్రభావంతోనే తాము ఇలా మారామని చెప్పడం సహజం. కూటికి లేకో.. ఉపాధిలేకో.. పనిచేయడానికి బద్దకించో దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడేవారినే ప్రజలు చీకొట్టడం, పోలీసులు అరెస్టు చేయడం ఎప్పట్నుంచో జరిగే తంతు. మరి కూటికి లేని కష్టాలో, కడుపు తరుక్కుపోయే బాధలో లేని ‘హైక్లాస్’ జనాలు కూడా కక్కుర్తిపడి దోచుకుంటుంటే.. వీరి ముందు చిల్లర దొంగల నేరాలు ఒక నేరమేనా..? ఈ కోణంలో చూస్తే.. జేబు కొట్టేవారికి, ఇంటికి కన్నం వేసేవారికి శిక్ష  వేయడాన్ని చూస్తే.. చిన్న నేరం చేసిన వారిని పెద్ద నేరం చేసిన వారు శిక్షించినట్లే తోస్తుంది.. నీతి, నిజాయితి, మానవత్వం ఏ కోశానా లేకుండా.. ఇప్పుడు జైళ్ళలో ఉన్న వారిచ్చిన తీర్పులన్నింటిని ఏ ‘లెక్క’న అర్థం చేసుకోవాలో అంతు చిక్కదు. న్యాయమూర్తులు, ఐఎఎస్, ఐపిఎస్‌లంతా ఆకాశం నుంచి ఊడిపడ్డ అతీంద్రియ శక్తులు గలవారేమీ కాదు. వారు కూడా మనలాంటి మామూలు మనుషులే.. కాకపోతే ఆయా పదవులను అలంకరించే వారు.. నీతి, నిజాయితి, మానవత్వాలకు కట్టుబడి హుందాగా వ్యవహరిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఉంటారు.  ప్రజాస్వామ్యం మాటున ‘ధనస్వామ్యం’ సాగుతుంటే.. పేదలు ఏ భరోసాతో బతకగలరు. ఈ లెక్కన ధనవంతుడు తంతే నోర్మూసుకోవాలి. ధనవంతుడు లేనివాడి ఆస్తులను ఆక్రమించుకుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలి.  డబ్బున్నోడు  ఏమైనా చేయగలడు, దేన్నైనా కొనగలడు. ఏ విలువలూ లేకుండా డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే సమాజంలో పేదల మాన, ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా దేవుళ్ళను నమ్మేవారు, నమ్మని వారు ఉన్నారు. ఏదేమైనా ఏదోఒకరకమైన భయం, బాధలు  ఉన్నవారే గుళ్ళు, గోపురాల చుట్టు తిరుగుతుంటారు. మొక్కులు ముక్కుకున్న వాళ్ళు వారివారి స్థోమతను బట్టి కానుకలు సమర్పిస్తుంటారు. మొక్కులకు దేవుడు కరుణించి కాపాడటం నిజమే గనుగ ఐతే  ఇందులో కూడా పేదవాడికి భంగపాటు తప్పదు. కోట్లకు పడగలెత్తినవారు హత్యలు చేసి శిక్షపడకుండా చేస్తే దేవునికి వేలకోట్లు కానుకగా సమర్పిస్తానని మొక్కుకుంటే.. వేలకోట్ల అవినీతి కేసునుంచి బయటపడేలా చూస్తే దేవునికి వజ్రకిరీటం చేయిస్తాను స్వామి అని మొక్కుకుంటే.. ముఖ్యమంత్రిని చేస్తే వజ్రవైఢూర్యాలు సమర్పిస్తానని రౌడీ రాస్కెల్ మొక్కుకుంటే ఏమౌతుంది..? నిరుపేదలకు అన్యాయం.. ధనవంతులకు న్యాయం జరుగుతుంది. ఈ లెక్కన చూస్తే ‘స్వామి’నీ కొనగల ‘ధనస్వాములు’ ఎందరో ఉన్నారు. నెత్తిన రూపాయి బిళ్ళ పెడితే.. అర్ధరూపాయి విలువ కూడా చేయని బేవార్సుగాళ్ళెందరో   అక్రమంగా కోటానుకోట్లు సంపాదించారు. ఇలాంటి వాళ్ళలో చాలామటుకు దేవుళ్ళకు లెక్కలేనంతగా ధన, కనక,  వస్తురూపంలో కానుకలు సమర్పిస్తున్న వారూ ఉన్నారు. ఈ విధంగానైతే అక్రమంగా వేలకోట్లు సంపాదించినోడు దేవునికి కానుకగా వందలకోట్లు సమర్పించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అమ్ముడుపోవాలే గానీ ‘స్వాములను’ కొనడం ‘ధనస్వాములకు’ రూపాయితో పెట్టిన విద్య.