Wednesday, July 11, 2012
Tuesday, July 3, 2012
సాహిత్యంపై ఛానెళ్ళ నిర్లక్ష్యం
సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడంలోనూ.. సాహితీవేత్తలను ప్రోత్సహించడంలోనూ ‘మీడియా’ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సాహిత్యం పలుప్రక్రియల ద్వారా జనజీవనంలో మమేకం. ఏ యుగంలోనైనా పేద, ధనిక తారతమ్యం లేకుండా సాహిత్యం అందరికీ అవసరమే. మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో మానసిక ఉల్లాసమూ అంతే అవసరము. ఈ అవసరాన్ని అనాదిగా‘కళ’లు తీరుస్తున్నాయి. ఇందులో కవిత్వ కళ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కవిని శాషన కర్త అనడం అతిశయోక్తి కాదు.. ప్రపంచ బాధను తన బాధగా తలకెత్తుకునేవాడే కవి. భాష విస్తృతానికి, చరిత్ర, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందిండానికి సాహిత్యం ఎంతగానో దోహదపడుతుంది. నేటి హైటెక్ యుగంలో సాహిత్యాని చదివే పాఠకుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. సాహిత్య పఠనం వల్ల భాషలో ప్రావీణ్యాన్ని సాంధించవచ్చు. మహత్తర శక్తిగల సాహిత్యాన్ని ‘మీడియా’ కూడా నిర్లక్ష్యం చేయడం మరింత బాధాకరం. గతంలో కేవలం సాహిత్యం కోసమే పత్రికలను నడిపేవారు. అలాంటిది నేటి దినపత్రికల్లో సాహిత్యానికి సముచిత స్థానం కల్పించకపోవడం తమ భాషను తామే అవమానపరచుకున్నట్లే అవుతుంది. ఉన్నంతలో చెప్పుకోదగ్గ విషయమేమంటే.. సర్క్యులేషన్ తక్కువగా ఉన్నా చిన్నపత్రికలు పూర్తిగా ఒక పేజీనీ సాహిత్యానికి కేటాయిస్తున్నాయంటే అభినందనీయం.
ఈ విషయంలో దినపత్రికలతో పోలిస్తే టెలివిజన్ ఛానెళ్ళు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి. వీటికి సెన్షేన్ వార్తల తర్వాత, సినిమాలు, ఫ్యాషన్ షోలు, మాట్లాడ్డం కూడా చేతకానివాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాలు... ఇలా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని చెత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. కవులను, రచయితలను, వారి కవిత్వాన్ని, రచనల గురించి కార్యక్రమాలు ప్రసారం చేస్తే సమాజ అభివృద్ధి, వికాసానికి ఎంతగానో ఉపయోగకరం. నేడు చాలావరకు పత్రికలు, టివి ఛానెళ్ళు సర్క్యులేషన్, రేటింగ్ పెంచుకోవడం కోసం పాకులాడుతున్నాయేగానీ... సమాజానికి మంచి చేస్తున్నామా..? చెడు చేస్తున్నామా..? అని ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియాగానీ ఆలోచించడం లేదు. అత్యధిక సర్క్యులేషన్‌గల దినపతివ్రిలు కూడా సినిమా పేజీల్లో అసభ్యకర శీర్షికలతో వార్తలు రాస్తున్నారు.. ఇటీవల దినపత్రికల్లోని సినిమా పేజీల్లో వస్తున్న శీర్షికలు ఇలా ఉంటున్నాయి.. “హీరో యిన్లకు అవి లేవు” . ఏవి లేవు..? ఆ అనుభవం మరువలేనిది...? ఎందుకోసం ఇలాంటివి రాస్తున్నారు.. సమాజంలో కొందరు బాధ్యతల్లేని వ్యక్తులు రకరకాల వికృత, వింత పోకడలను అనుసరిస్తుంటారు.. బాధ్యతాయుతమైన మీడియా కూడా అలాంటి బాటలో నడవడం చాలా దారుణమైన విషయం. ప్రింట్/ఎలక్ట్రానిక్ ‘మీడియా’ సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయడమంటే.. సమాజాన్ని పరోక్షంగా పాతాళానికి నెట్టేసినట్లే.. మహోన్నతమైన, ఆదర్శవంతమైన, అత్యుత్తమమైన రచయితలగురించి నేట్బి సమాజంలో ఎంతమందికి తెలుసు. ప్రముఖ కవులను గానీ.. ప్రముఖ జాతీయ నాయకులను గానీ నేడు ఎంతమంది గుర్తించే స్థితిలో ఉన్నారు..
వీటికి సమాధానాలు తెలిస్తే ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి. కనీసం ఈ మాట కూడా చాలా మందికి తెలియదు. నేటి రాజకీయ నాయకులు చేస్తున్నదే గదుల్బాజీ పనులు... అది చాలదన్నట్లు ఛానెళ్ళలో గంటలు తరబడి పనికిరాని, ప్రయోజనం లేని చర్చా కార్యక్రమాలు. వీటివల్ల వీసమెత్తు ఉపయోగమైనా ఉంటోందా..? సమాజంలోని దురాచారాలు, కుసంస్కృతి, లంచగొండితనం, అంటరానితనం, వరకట్నం.. ఇలా సమాజానికి చీడలాంటి విషయాలమీద ఎంతోమంది మహానుభావులు తమ రచనల ద్వారా పోరాడారు. తద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించారు. ఇప్పటి యువతలో చాలా మందికి లేఖ రాయడమే చేతగాదు. అలాంటిది రచనలో ఎన్నెన్ని ప్రక్రియలున్నాయి.. భాషను ఎలా మలుచుకుని, ఎలాంటి రచనలు చేయొచ్చు అన్న విషయాలు బొత్తిగా తెలియదు. మహాద్భుతమైన రచలు అందించిన రచయితల్లో.. సుతిమెత్తగా మొహం మీద మొత్తినట్లు కొందరు రాస్తే.. నీళ్ళు నమలకుండా సూటిగా ముఖం మీద గుద్దినట్టు రాసినవారు కొందరైతే.. వ్యంగ్యంతో వెక్కిరించినవారు, నవ్విస్తూనే.. ఏడ్పించే వారు .. తప్పుడు పనులు చేసినోళ్ళకు పరువుతోపాటు ప్రాణం పోయేవంటి రచనలు చేసిన ఆదర్శ రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి మనం జన్మజన్మలకు రుణపడి ఉంటాం.. అంతటి రచనా సామర్థ్యం, సత్తా, చేవ మనకు లేకపోయినా ఫర్వాలేదుగానీ... కనీసం అలాంటి అమూల్యమైన ‘సాహితీ సంపదను’ కూడా కాపాడుకోలేకపోతున్నామంటే.. క్షమించారని నేరం.. మనందరం సిగ్గుతో తలదించుకోవాలి.
ఓడి గెలుస్తారా..? గెలిచి ఓడిస్తారా..?
ఆట ఎప్పుడు మొదలైందో.. ఎలా మొదలైందో సామాన్యులకు అర్థం కావడం లేదుగానీ.. రాజకీయ చదరంగం మాత్రం రసకందాయంలో పడింది. ఒక్కడి మీద యుద్ధానికి వంద మంది సైన్యం కాలు దువ్వుతున్నారు. అక్షరాలా మహా భారత యుద్ధాన్ని తలపిస్తోంది. అదేదో కాదు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కొనసాగిస్తున్న దాడి.. నిజంగా ఇది హస్తినకు.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న యుద్దంగా అభివర్ణించినా అతిశయోక్తి కాదు... తప్పొప్పులు దోషులకెరుక.. పాపం పుణ్యం దేవుళ్ళకెరుక..! గతంలో తెరవెనుక ఏంజరిగిందో ఖచ్చితంగా ఎవ్వరికీ అంతుబట్టని విషయం. కానీ ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే.. ఇది ముమ్మాటికీ కక్ష్య సాధింపు చర్యేనని ఎంతటి అమాయకున్ని అడిగినా చెప్పేస్తాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జగన్ కలియుగ అభిమన్యుడిలా కనిపిస్తున్నాడు. దీనికి ఉప ఎన్నికల ఫలితాలే కొలమానంగా చెప్పుకోవచ్చు. వీటిని చాలామంది సెంటిమెంట్‌గా కొట్టి పారేస్తున్నారు కానీ.. తండ్రి వల్ల వచ్చిన సానుభూతి యాభై శాతం ఉంటే... కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన అణచివేతల చర్యలవ్ల అది వంత శాతానికి చేరింది.. సానుభూతి కాస్తా ముదిరి అభిమానంగా మారిపోయింది.
కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ఈ యుద్ధం జగన్ దగ్గర నుంచి ప్రారంభించినట్లుగా కనిపిస్తున్నా... వాస్తవానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డినుంచే ప్రారంభించేందేమో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం వెనుకు కుట్ర ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను కూడా అంత ఆశామాషీగా కొట్టిపారేయడానికీ లేదు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలుగానీ.. ఇటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబీకులు గానీ అసలు విషయాన్ని బయట పెట్టకుండానే ముసుగులో గుద్దులాటలాగా వారిలో వారు పోరాడుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్‌తోపాటు ప్రతి పక్ష పార్టీలు, సిబిఐ వారు ఆరోపిస్తున్నట్లుగా వైఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగితే జరిగి ఉండొచ్చేమోగానీ.. ప్రజలు మాత్రం వాటికి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడంలేదు. నేటి రాజకీయాల్లోనూ.. ముఖ్యమంత్రులుగా చేసిన నేతల్లోనూ అవినీతి మలినం అంటని వారెవ్వరూ లేరని.. అలాంటి వారితో పోల్చినా, వైఎస్ తాను దోచుకున్నదంతా దాచుకోకుండా కొంతలో కొంతైనా పంచడంలో అందరికంటే మేలైనవాడనే అభిప్రాయమూ ప్రజల్లో వ్యక్తమవుతోంది. వందేళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీ తమకు ఎదురుతిరిగిన మహామహులనే దారికి తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇందుకోసం సామదానబేద దండోపాయలును ప్రయోగించడంలో కాంగ్రెస్ పార్టీ పేరు గడించింది. అంతటి ఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి జగన్ విషయంలో మాత్రం తన పాచికలు సక్రమంగా పారడంలేదనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తెలివిగా యోచిస్తోందో..? లేక దిక్కు తోచని స్థితిలో ఇష్టానుసారం వ్యవహరిస్తోందో... అర్థం కావడం లేదు. దీన్ని తెలివిగా అర్థం చేసుకోవాలా..? లేక అతి తెలివిగా ఊహించుకోవాలో..? విశ్లేషకుల కూడా అంతుచిక్కడం లేదు. ఏదేమైనా ‘జీరో’ లాంటి జగన్‌కు మాత్రం దేశవ్యాప్తంగా ‘హీరో’ ఇమేజ్ తెచ్చిపెట్టడంలో కాంగ్రెస్ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉంది. వాస్తవానికి కాంగ్రెస్‌తో విబేధించిన వారు చాలా మందే ఉన్నా.. ఎదురించి నిలబడిన వాళ్ళు మాత్రం అరుదే..! కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలో మార్పు రాకుంటే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కానీ, తన తల్లినిగానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక వేళ భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి అయితే తన తండ్రిలాగే ప్రజాదరణ పొందుతాడా..? లేక రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని కొనసాగిస్తాడా..? అన్నది ఇప్పుడే తేల్చలేని విషయం.. పాతకాలపు
ఫ్యాక్షన్ బాటలో కాకపోయినా.. తాననుకున్నది సాధించడంకోసం సైలెంట్ కిల్లర్‌గా తనపనులు తాను చేసుకుపోవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌తో జగన్ చేస్తున్న పోరాటం.. బలవంతుడితో బలహీనుడు తలపడినట్లు తలపిస్తోంది.. ఇలాంటి పోరులో బలహీనుడు గెలిస్తే అతిపెద్ద విజయం.. ఓడితే నైతిక విజయం.. మొత్తానికి జగన్ మాత్రం కొండకు వెంట్రుక వేసి లాగుతున్నాడు... వస్తే కొండ, పోతే వెంట్రుక.. అదే గెలుపు తిరగబడితే.. అతిపెద్ద జాతీయ పార్టీ ఘనచరిత్రను కట్టుకున్న మూటలోనే ఈ పరాభావాన్ని మూటగట్టుకోకతప్పదు..!
Saturday, June 30, 2012
‘కాలమ్.. జ్ఞానమ్’ కామెడీగా
‘కాలమ్’ కొద్దీ రాసే రచయితలున్నా.. రచనలకు ఇది అంతగా సరైన కాలం కాదు. ఎందుకంటే దిన పత్రికల్లోని శీర్షికలు చదవడానికే ఎవరికీ తీరిక లేని కాలం ఇది. అలాంటిది సీరియస్ రచనలనో.. జ్ఞానం కలిగించే రచనలనో చదివేవారు చాలా తక్కువ. కొంతలో కొంత సంతృప్తికరం ఏంటంటే.. ‘వ్యంగ్యం’ అంటించి రాస్తే సమయం, సరదా లేనివారు కూడా వదలకుండా చదివే అవకాశం ఉంటుంది.
శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానమ్ ఎంతటి ప్రాశస్త్యమైందో తెలిసిందే. అంత విస్తృతంగా కాకపోయినా అంతే ‘దూర’, ‘దివ్య’ దృష్టితో కామెడీ కాలజ్ఞాన్ని రాశారు దురికి మోహన్ రావుగారు. ఆయన రాసిన కామెడీ కాలజ్ఞానం చదివిన వారెవ్వరికైనా ఆయన్ను ముద్దుగా శ్రీశ్రీశ్రీ కలియుగ వీరబ్రహ్మాండ స్వామి అని పిలవాలనిపిస్తుంది. దురికి మోహన్‌రావుగారు చాలా సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ, కొన్నింటికి స్ట్రైట్‌గానూ పనిచేశారు. ఆయన గతంలో రాసిన ‘సన్నకారు ప్రేమికులు’ అప్పట్లో సంచలనం. అమెరికా సంస్కృతి నేపథ్యంగా ఆంగ్లంలో రాసిన ఎక్స్ రే మ్యాన్ ఇప్పట్లో మరింత సంచలనం. ప్రపంచ వ్యాప్తంగా పేరు మోగినరావ్ తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం. ఈయన సాహిత్యంలో పలు ప్రక్రియల్లో కలంతిరిగిన రచయిత అనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. కామెడీ కాలజ్ఞానం అనే పేరు చూడగానే ఇదేదో చౌకబారు రచనేమో అనుకున్నా.. కానీ సార్థక నామధేయం అన్నట్లుగా ఈ పుస్తకానికి ఆపేరు అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. కామెడీ అన్నదిపేరులోనే కాకుండా రచనల్లో కూడా చివరి దాకా పడిపడి నవ్వుకునేలా చేస్తుంది. సాక్షి ఆదివారం అనుబంధంలో కాలమ్‌గా వచ్చిన ఈ రచనలు భవిష్యత్ కాలాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఇకపోతే జ్ఞానం.. టెక్నాలజీ అభివృద్ధి చెందితే సమాజంలో, సంస్కృతిలో, వ్యక్తుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పులొస్తాయి అనే విషయాలను పెద్దగా చదువుకోని వారికి కూడా అర్థమయ్యేలా దివ్యమైన దూరదృష్టితో రాశారు. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ‘ఆదిత్య ౩౬౯’ సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఒక శాస్త్రవేత్త కాలయంత్రం (టెమ్ మిషిన్) ను కనిపెడతాడు. దాని ద్వారా భూత, భవిష్యత్ కాలాల్లోకి ప్రయాణించ వచ్చు. కృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళి రావచ్చు, ౨౦౫౦ సంవత్సరంలోకి ప్రయాణించవచ్చ్చు. ఐతే ఆదిత్య ౩౬౯కు కామెడీ కాలజ్ఞానికి చాలా తేడా ఉంది. ఆ సినిమా సీరియస్‌గానూ, ఉత్కంఠగానూ సాగితే.. ఈ రచన నవ్వుపుట్టేలా, ఆనందంగా.. ఆహ్లాదంగా చదివిస్తుంది. ఇవన్నీ దురికిగారు మేథాశక్తితో ఊహించి (ఇమాజినేషన్) రాసిన ఫిక్షన్ అయినా ఏమాత్రం వాస్తవ దూరం కాదనిపిస్తుంది. ఉదా- ‘శ్మశానంలో ఇల్లు’ అన్న శీర్షికతో భవిష్యత్‌లో హైదరాబాద్‌లో జనావాసాలు ఎలా ఉంటాయో చూపించాడు. ఈ విషయంలో అయితే ౨౦౫౦ వరకు కూడా అక్కర్లేదు, ఆ దృశ్యం ఇప్పుడే కనిపిస్తోంది. ఎక్కడంటారా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెం-౧౨కు వెళ్తే చాలు. సమాధుల దగ్గర ఇల్లు కట్టారో..? ఇళ్ళ దగ్గర సమాధులు కట్టారో..? తేల్చుకోవడం అంత తేలిక కాదు. అలాగే ‘దేశ భాషలందు తెలుగు ‘లెస్సు’ అంటూ రాబోయే కాలంలో తెలుగుకు ఎలా తెగులు పడుతుందో అద్దంలో చూపినట్లు రాశాడు. ఈ విషయంలో కూడా ౨౦౫౦ వరకూ అక్కర్లేదు ఇప్పటికే తెలుగు భాషకు పట్టాల్సినంత తెగులు పట్టేసింది. తియ్యటి తెలుగులో అమ్మా నాన్నా, అవ్వ తాత, అని పిలవాలన్నా, పిలుపించుకోవాలన్నా కూడా నా మోషీగా అనుకునే వారెందరో ఉన్నారు. అంతెందుకు ఇప్పటితరంలో ఒక్క ఐదు నిమిషాలు ఏ ఒక్క ఇంగ్లీషు పదంలేకుండా మాట్లాడమంటే చాలా మందికి నోరు రాదు. అలాగని పూర్తిగా ఇంగ్లీషులో మాట్లాడమన్నా చేతకాదు. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది పరిస్థితి. ఉదాహరణకు.. ఒక ఆర్టీసి బస్సు మీద చూస్తే.. ప్రొద్దుటూరు అనే ఊరు పేరును ప్రోద్దుటూరు అని రాసుంది. ఇంకో వీధిలో చూస్తే ఇచ్చట ఊచ్చలు పోస్తే చేప్పుతో కొట్టబడను. మన భాష, సంస్కృతి ఎంతగా అడుగంటి పోతున్నాయో తెలిపే మరో ఉదాహరణ. నేనో టివి ఛానెల్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి రాసిన పుస్తకం ‘పరికిణి’ కొన్నాను. అదే ఛానెల్‌లో పనిచేస్తున్న ఒకమ్మాయి చూసి అదేంపుస్తకం అనడిగితే, పరికిణి అని చెప్పాను అంటే ఏంటి అనడిగింది. ఆ ప్రశ్న వినగానే నాకు కోపం, ఆశ్చర్యం, జాలి, బాధ అన్నీ ఏకకాలంలోనే కలిగాయి. తెలుగమ్మాయి అయ్యుండీ పరికిణి అంటే తెలియనందుకే కోపం. ఆమె అమెరికాలో పెరిగిందీ కాదు, మహానగరంలో పుట్టిందీ కాదు. సాధారణ పట్టణం నుంచి ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చింది. రేపో మాపో పెళ్ళి కాబోయే తెలుగమ్మాయికి పరికిణి అంటే తెలియనందుకు జాలి. ఇవి చూడ్డానికి చిన్న విషయాలుగానే కనిపించొచ్చు కానీ.. ఇది ఊహించుకుంటే ఒక్కోసారి భయమేస్తుంది.
నిజంగా ఈ పరిణామం ఎటు దారి తీస్తుందా అని. తెలుగు నేలమీద, తెలుగు వారికి మాతృ భాషలో సంపూర్ణంగా రాయడం, మట్లాడ్డం రావడం లేదంటే ఇంతకంటే భాషా దౌర్భాగ్యం ఎక్కడా ఉండదు. ౨౦౫౦లో తెలుగు భాషా మరెంత దరిద్రంగా తయారవతుందనేది దేశ భాషలందు తెలుగు ‘లెస్సు’ అనే శీర్శికన అద్భుతంగా రాశారు. అందులో ఒక చోట శోభనం రాత్రి ‘శృంగార నైషధం’ గ్రంథంలోని ఒక పద్యాన్ని పాడమని భర్త అడిగితే బదులుగా అతని భార్య చెప్పే సమాధానం ఇలా ఉంటుంది.. ‘నేను ఆ నేమ్ హియర్ చేయలేదు యార్, అయినా వాటీస్ దిస్ నాన్సెన్స్ పద్యాలు’ అంటుంది చిరాకుగా. ఈ ఒక్క వాక్యంతోనే అర్థమవుతుంది మన భాష, సంస్కృతి ఏ స్థాయిలో ఉండబోతున్నాయో.. ఇకపోతే ఇంటి పనిమనుషుల గురించి రాసింది ఆలిండియా అంట్లు తోమే వాళ్ళ సంఘం. ఇప్పుడే నమ్మకంగా, చక్కగా పని చేసే మనుషులు దొరకడం కష్టసాధ్యంగా ఉంది. ఇక భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది చాలా బాగా రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే దురికి గారు రాసిన పుస్తకమంత అవుతుంది. ఐనా ఒక్క మెతుకుతోనే తెలిసిపోతుంది కదా అన్నం ఉడికిందీ లేనిదీ.. అన్నింటి గురించి చెప్పడమెందుకు. ఐతే ఈ పుస్తకంలో కెవ్వున అరవడం, ఉలిక్కిపడడం, హీనంగా, ధీనంగా, హీనాతి హీనంగా, ధీనాతి ధీనంగా, గిర్రున బుర్ర తిరగడం వంటి పదాలు సందర్భానుసారంగానే అయినా పదేపదే రావడంతో కొద్దిగా విసుగు అనిపిస్తుంది. ఇది మినహా వేరే ఏ ఇబ్బందీ లేదు..
హెచ్చరిక- ఈ పుస్తకం పట్టుకోవడం వరకే మీ చేతుల్లో ఉంటుంది.. వదలడం మీ వల్ల కాదు.. పూర్తిగా చదివే వరకూ. అంతేకాదండోయ్ వ్యంగ్యం వ్యసనం లాంటిది.. మిమ్మల్నే కాదు.. మీ చుట్టుపక్కల వారిని కూడా బానిసలుగా చేస్తుంది. నేను చెప్పాలనుకున్నది చెప్పాను.. తర్వాత మీ ఇష్టం.. -నవకలం
Wednesday, June 6, 2012
అంతమౌతున్న ‘అపురూపజన్మ’
ప్రేమ, దయ, కరుణ, ఓర్పు, సహనం వీటన్నింటి కలయికే ‘స్త్రీ’. స్త్రీలను దేవతలుగా కొలిచినట్లు పురాణ, ఇతిహాసాలు చాటుతున్నాయి. ఇలాంటివన్నీ కాకమ్మకథలుగా కొట్టిపారేసినా.. రాణి రుద్రమ దేవి, ఝాన్సీలక్ష్మీభాయి వంటి వీర నారీమణుల విజయగాథలు ఎవరూ కాదనలేని చారిత్రక సత్యాలు. ఈ సృష్టిలో మహిళకు సాటిరాగల ప్రత్యామ్నాయమేదీ లేదు. తల్లిగా, చెల్లిగా, ఆలిగా ప్రేమ పంచడంలో ఆమెకు ఆమే సాటి. ఏ రూపంలోనైనా అమితమైన అభిమానం చూపే స్త్రీ.. ఇంటి పరువు కాపాడ్డానికి అదే స్థాయిలో శక్తి సామర్థ్యం, సహనాన్ని చూపే స్త్రీ, తేడా వస్తే అపర కాళికా శక్తిలా తన విశ్వరూపాన్ని ప్రదర్శించగలదు. అలాంటి స్త్రీ మూర్తిని మనం దేవతలా పూజించకపోయినా, కనీసం సాటి మనిషిగా కూడా చూడలేకున్నాం. మనుషులుగా మనం ఆధునికంగా ఎంత ఎత్తుకు ఎదిగామో... మానవత్వం విషయంలో అంతకు పదిరెట్లు దిగజారిపోతున్నాం. ఆడవాళ్ళు మగవారితో అన్నింటా సమానం.. వారికి సమాన హక్కులు అంటూ రాజకీయ నాయకులు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు వినడానికి చక్కగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం సున్నా. ఎక్కడిదాకో ఎందుకు.. ఆర్టీసి బస్సుల్లో ఆడవారికి కేటాయించిన సీట్లలో కూర్చున్న మగవారిని వాళ్ళు గద్దించి అడిగితేగానీ లేవడం లేదు.
మనిషి ఈ సృష్టిలోని ఏఒక్కదాన్నైనా కూడా నాశనం చేసి, తానొక్కడే మనుగడ సాగించాలనుకోవడం దుర్లభం.. దురాలోచన అవుతుంది. ఇది గ్రహించలేకనే తన జన్మకు కారణమైన, ప్రకృతిలోనూ, జీవనంలోనూ తనతో సమానమైన ఆడజన్మనే అంతం చేయడానికి కంకణం కట్టుకుంది నేటి సమాజం. కొందరు పురిటినుంచే కాటికి పంపుతుంటే.. మరి కొందరు కడుపులోనే కరిగించేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నాం.. ఎందుకిలా జరుగుతోందన్న విషయం ఏ ఒక్కరూ ఆలోచించడంలేదు. దీనివల్ల ఎంతటి దుష్పరిణామాలు ఎదురవుతాయో కూడా ఆలోచించడం లేదు. అనాదిగా మన సంస్కృతిలో ఆడవారంటేనే ఒక చులకన భావన పాతుకుపోయి ఉంది. నిజానికి చెప్పాలంటే ఆడమనిషి అంటే.. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన భావనలున్నాయి. కొందరికి విలాసం, భోగవస్తువుగా ఉంటే.. ఇంకొందరికి పనిమనిషి.. ఇప్పటికీ చాలా మందికి భార్య అంటే జీవిత భాగస్వామి కాదు, ఆమె ఒక బానిస. ఆడవారి పుట్టుకే మగవారితో పోలిస్తే చాలా భిన్నమైంది. వారి శరీరతత్వం ప్రత్యేకమైంది. ఆడవారిని ఆమడ దూరంలో ఉంచుతుండడానికి ఈ అంశాలు కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా ఆడపిల్లల సంఖ్య గణనీయంగా క్షీణించిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ౨౦౧౧సంవత్సరం సేకరించిన లెక్కల ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా మగవారితో పోల్చితే మహిళల నిష్పత్తి దారుణంగా పడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే దాదాపు ౧౮శాతం తేడా ఉంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్న చందంగా ఆడజాతి అంతమొందుతుండడానికి కూడా అన్నే కారణాలున్నాయి. ఈ పాపంలో సమాజంలోని అందరూ భాగస్వాములే. ఈ విషయంలో ప్రధానంగా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. మొదట ఆడపిల్లల్ని కనే విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడంలోనే విఫలమైందని చెప్పాలి. తర్వాత ఆడపిల్లలను పిండదశలోనే చంపేస్తుండడానికి స్కానింగ్ సెంటర్లదే ప్రముఖ పాత్ర. వీటిని కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమౌతూనే ఉంది. దేశంలోని ఏమూల చూసినా మహిళలకు భద్రత శూన్యం. పుట్టినప్పటినుంచి పెళ్ళయ్యే వరకూ వారికి ఏవిధమైన రక్షణ, భరోసా ఉండడం లేదు. ఇదే మన ఆంధ్రద్రేశ్‌లోనే.. ఉన్నతపాఠశాల్లో చదివే అమ్మాయిలకు బడిలో మరుగుదొడ్లు లేక, ఆరుబయటే బహిర్భూమికి వెళ్తున్న దుస్థితి ఎన్నో జిల్లాల్లో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితే మన పాలకుల, ప్రభుత్వాధికారుల పిల్లలకు ఎదురైనా కూడా ఇలాగే గుడ్లప్పగించి చూస్తూ ఊరుకుంటారా..? ఎవరి పిల్లలైనా పిల్లలే.. కోటీశ్వరులకైనా.. కూటికిలేని వారికైనా సిగ్గు సిగ్గే..! సిగ్గుమాలిన పనులు మనం చేస్తూ.. నిందలు మహిళలపైనా..? తప్పులు మనం చేస్తూ.. పసిప్రాయంలోనే ఆడ పిల్లలను శిక్షించడం న్యాయమా..? మహోన్నతమైన స్త్రీ మూర్తిని హత్య చేస్తున్న నేరంలో కుటుంబం, సమాజం, ప్రభుత్వం అందరూ దోషులే.. ఇప్పుడు చేస్తున్న తప్పులకు భవిష్యత్తులో కఠినశిక్ష అనుభవించక తప్పదు. ముందు తరాలవారు తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఆడపిల్లంటే నెత్తిమీద కుంపటి కాదు.. ఆణిముత్యం. ఆడ జన్మ అపురూప జన్మ..
మూగ రోధన..!
మనుషులు రానురాను రాక్షసుల్లా మారిపోతున్నారు. విద్యరాక ముందు వినయంగా ఉండి.. విద్య నేర్చాక వింతపశువుల్లా ప్రవర్తిస్తున్నట్టుంది. ఆధునికంగా ఎంత ఎత్తుకు ఎదుగుతున్నామో మనిషులుగా అంతకంత దిగజారిపోతున్నాం. మనుషుల రాక్షసత్వానికి తల్లిలాంటి ప్రకృతి విలవిల్లాడిపోతోంది. ప్రకృతి మూగరోధనను ఆలకించే మనసున్న మనుషులే కనిపించడం లేదు. ప్రకృతిలోని సమస్తానికి తానే అధిపతిని అన్నట్లుగా ఉంది మనిషి వ్యవహారం. మనిషి ఉనికికి ఎంత ప్రాధాన్యముందో.. ప్రకృతిలోని అన్నింటికీ అంతే ప్రాధాన్యముంది. భూమి, చెట్టు, నీరు, రాయితోపాటు సమస్త ప్రాణికోటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. వాటన్నిటికంటే మనలో ఉన్న ప్రత్యేకత తెలివి. దీనివల్ల గర్వం తలకెక్కకుండా హుందాగాను, మంచికి పాటుపడేలాగా వ్యవహిరించాలి. అదేదో గొప్పగానో, అధికారంగానో భావించడం చాలా ప్రమాదకరం. నేటి ఆధునిక యుగంలో సమాజం ముందు చూపు లేకుండా క్షణికానందాలకు, పైపైమెరుగులకే ప్రాధాన్యమిస్తోంది. దీనివల్ల ప్రకృతిలో సహజసిద్ధంగా లభించేవన్నీ అంగట్లో సరకుల్లాగా కొనుక్కుంటున్నారు. పైకి ఎంతందంగా కనిపించినా ప్లాస్టిక్ పువ్వు సహజమైన పువ్వు ల్లాగా సువాసన వెదజల్లలేదు. సహజమైనవాటిని నాశనం చేస్తూ.. ప్రత్యామ్నాయంగా ప్రతిఒక్క దాన్ని కొనుక్కుంటూనే ఉన్నారు. వ్యాయామం నుంచి నవ్వుని కొనుక్కునే విపరీత కాలం దాపురించి. అంగడికెళ్ళి పాల ప్యాకెట్ తేవడానికి కూడా బద్దకించే వారు.. జిమ్‌లకు వెళ్ళి డబ్బు పెట్టి మరీ వ్యాయామం చేస్తున్నారు. చేయాల్సిన అన్నిపనులకూ ఆటోలు, బైక్‌లు, బస్సుల మీద వెళ్ళడం... ఉదయం సాయంత్రం ఇంటిల్లిపాది వాకింగ్, జాగింగ్ చేయడం. సహజంగా జరగాల్సినవన్నీ వికృతంగా ఎందుకు జరుగుతున్నాయో ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా..? మొత్తం మనిషి జీవితచక్రమే అస్తవ్యస్తంగా మారిపోయింది. మనుషులు ఆనందంగా, హాయిగా బతకాలనుకోవడం తప్పు కాదు.. కానీ అది పరిసరాలను నాశనం చేసి మనం పొందేది సుఖం కాజాలదు. ఈవిధంగా తాత్కాలికంగా సుఖ భోగాలు అనుభవించినా భవిష్యత్తులో ప్రళయాలను ఎదుర్కోక తప్పదు. మనిషి ప్రతి విషయాన్ని వ్యాపార దృక్కోణంలోనే చూస్తున్నాడు. చెట్టు, పుట్ట, రాయి రప్పల గురించి మనుషుల రాతిహృదయాలకు అర్థం కాకపోయినా.. కనీసం ముద్దులొలికే పక్షులు, చిన్నిచిన్ని జంతువులను కూడా వ్యాపార వస్తువుల్లాగే చూస్తున్నామంటే మనల్ని మనుషులని పిలవాలా..? లేక రాక్షసులనాలా..? వన్యప్రాణుల్ని విచక్షణా రహితంగా వేటాడుతున్నారు. కొన్ని పక్షుల, జంతువుల మాంసాన్ని విందు, వినోదాలలో వడ్డించడం గొప్పతనంగా భావించే సంపన్నులు ఎందరో ఉన్నారు. జింక, కుందేలు, నెమళ్ళు ఎంతో చూడముచ్చటగా ఉండే చిరు ప్రాణులు. వాటిని ఎంతగా హింసించినా ప్రతిఘటించలేని సాధు ప్రాణులు. మయూరాలకు మన సంస్కృతిలోనూ, ప్రకృతిలోనూ ప్రత్యేక స్థానం ఉంది. అది మన జాతీయ పక్షి కూడాను. మయూరాలు పురి విప్పి నర్తించే సుందర, మనోహర దృశ్యాన్ని వర్ణించడానికి ఏ ప్రపంచంలోని ఏ భాషా సరిపోదు. అలాంటి మయూరాలను ఈకలకోసం మట్టుబెడుతున్నారు నేడు. సహజసిద్ధమైన అందాలను అమ్ముకుంటూ.. ఆసొమ్ముతో విపత్తులను కొని తెచ్చుకుంటున్నాం.
ఆలోచించే తెలివిలేని, వేరే విధంగా ఆహారాన్ని సంపాదించుకుని శక్తి యుక్తులులేని క్రూర మృగాలు మాత్రమే వేట మీద ఆధారపడతాయి. అన్ని విధాలా శక్తివంతులమైన మనుషులం క్రూరమృగాల బాటన నడవడం నాగరికమా..? అనాగరికమా..? మనకు మనం ఒక్కసారి ప్రశ్నిచుకోవాల్సిన తరుణం ఇది. వన్యప్రాణి చట్టాలు, అటవీ చట్టాలు ఉన్నా కూడా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ధనవంతులు, స్మగ్లర్ల దృష్టిలో అవన్నీ చిత్తుకాగితాలతో సమానం. విస్తారంగా చెట్లు పెంచే సంస్కృతి అంతరించిపోయింది. వృక్షాలుగా పెంచాల్సింది పోయి కుండీల్లో కుదించే పరిస్థితి వచ్చింది. ఇష్టారీతిగా గనులను తవ్వేస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి విపత్కర పరిణామాలకు దారి తీస్తాయో ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. పూర్వం అనామకులు ఇంటికొచ్చినా మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొనుక్కుని తాగే దుస్థితిలో బతుకుతున్నాం. వీటన్నింటికి కారణం మనుషులు చేస్తున్న వికృత చేష్టలే. తల్లివంటి ప్రకృతిని బాధ పెట్టే ఏ బిడ్డా బాగుపడడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమనేది నానుడి.. కానీ మనకు పట్టుకోవడానికి ఆ ఆకులు కూడా మిగిలేలా లేవు.!
దేవుళ్ళను కూడా కొనేస్తారేమో..!?
ఆస్తికులు, నాస్తికులు అన్న తేడా లేకుండా ప్రజలంతా దేవుడి మీద భారమేసి బతకాల్సిన రోజులు దాపురించాయి. అసలు దేవుడు ఉన్నాడా..? లేడా...? అన్నది పశ్న్రే కాదిప్పుడు. ఉంటేగింటే కనీసం ఆదేవుడైనా డబ్బుకు అమ్ముడుపోకుండా ఉంటాడా..? అన్నదే అసలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష దైవాలుగా భావించే చట్టం, న్యాయాలకే సంకెళ్ళు పడుతుంటే.. సామాన్యుల గుండెల్లో పిడుగులు పడ్డట్టుంది. కాపాడాల్సిన దేవుళ్ళే కాటేస్తుంటే.. సామాన్యుల గోడు ఎవరికి చెప్పుకోవాలి..? న్యాయం కూడా అంగడి సరకైపోతే నిరుపేదల పరిస్థితి ఏంటి..? మన భారత దేశంలో బహిరంగంగా చెప్పుకోవడానికే ప్రజాస్వామ్యం.. తెరవెనుక నడుస్తున్నదంతా ‘ధనస్వామ్య’మే..! క్యాన్సర్ లాంటి లంచం ప్యూన్లు, అటెండర్ల స్థాయినుంచి ఐఎఎస్, ఐపిఎస్‌ల దాకా పాకింది. ఐతే సమాజంలోని అన్ని రంగాలూ భ్రష్టుపట్టిపోయినా.. న్యాయం మాత్రం నిప్పులాగే ఉందన్న నమ్మకం, ధైర్యం సామాన్య ప్రజల్లో ఇప్పటివరకూ సడలిపోలేదు. కానీ నేడు నిప్పుకూ చెదలు పట్టింది. న్యాయానికే సంకెళ్ళు పడ్డాయన్న విషయం వెన్నులో భయం పుట్టిస్తోంది. కాలికింది భూమి కంపించినట్లుంది. ఏకాలంలోనైనా సమాజం నీతి, న్యాయం, నమ్మకం అనే పునాదులమీదే కొనసాగుతుంది. ఆ పునాదులే బీటలు వారితే నిట్టనిలువునా కుప్పకూలిపోతుంది. రాజులకాలపు తీర్పులైనా, రచ్చబండ తీర్పులైనా అవే ప్రాతిపదికగా ఉండేవి.
న్యాయమూర్తులే కటకటాల్లోకెళ్తున్న పరిస్థితుల్లో జేబుదొంగలను, బంధిపోట్లను నిందించేందుకు, శిక్షించేందుకు ప్రజలకుగానీ.. పాలకులకుగానీ వీసమెత్తు అర్హత కూడా లేదు. ఎలాంటి నేరాలకు పాల్పడిన నేరస్థులైనా పరిస్థితుల ప్రభావంతోనే తాము ఇలా మారామని చెప్పడం సహజం. కూటికి లేకో.. ఉపాధిలేకో.. పనిచేయడానికి బద్దకించో దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడేవారినే ప్రజలు చీకొట్టడం, పోలీసులు అరెస్టు చేయడం ఎప్పట్నుంచో జరిగే తంతు. మరి కూటికి లేని కష్టాలో, కడుపు తరుక్కుపోయే బాధలో లేని ‘హైక్లాస్’ జనాలు కూడా కక్కుర్తిపడి దోచుకుంటుంటే.. వీరి ముందు చిల్లర దొంగల నేరాలు ఒక నేరమేనా..? ఈ కోణంలో చూస్తే.. జేబు కొట్టేవారికి, ఇంటికి కన్నం వేసేవారికి శిక్ష వేయడాన్ని చూస్తే.. చిన్న నేరం చేసిన వారిని పెద్ద నేరం చేసిన వారు శిక్షించినట్లే తోస్తుంది.. నీతి, నిజాయితి, మానవత్వం ఏ కోశానా లేకుండా.. ఇప్పుడు జైళ్ళలో ఉన్న వారిచ్చిన తీర్పులన్నింటిని ఏ ‘లెక్క’న అర్థం చేసుకోవాలో అంతు చిక్కదు. న్యాయమూర్తులు, ఐఎఎస్, ఐపిఎస్‌లంతా ఆకాశం నుంచి ఊడిపడ్డ అతీంద్రియ శక్తులు గలవారేమీ కాదు. వారు కూడా మనలాంటి మామూలు మనుషులే.. కాకపోతే ఆయా పదవులను అలంకరించే వారు.. నీతి, నిజాయితి, మానవత్వాలకు కట్టుబడి హుందాగా వ్యవహరిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఉంటారు. ప్రజాస్వామ్యం మాటున ‘ధనస్వామ్యం’ సాగుతుంటే.. పేదలు ఏ భరోసాతో బతకగలరు. ఈ లెక్కన ధనవంతుడు తంతే నోర్మూసుకోవాలి. ధనవంతుడు లేనివాడి ఆస్తులను ఆక్రమించుకుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలి. డబ్బున్నోడు ఏమైనా చేయగలడు, దేన్నైనా కొనగలడు. ఏ విలువలూ లేకుండా డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే సమాజంలో పేదల మాన, ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా దేవుళ్ళను నమ్మేవారు, నమ్మని వారు ఉన్నారు. ఏదేమైనా ఏదోఒకరకమైన భయం, బాధలు ఉన్నవారే గుళ్ళు, గోపురాల చుట్టు తిరుగుతుంటారు. మొక్కులు ముక్కుకున్న వాళ్ళు వారివారి స్థోమతను బట్టి కానుకలు సమర్పిస్తుంటారు. మొక్కులకు దేవుడు కరుణించి కాపాడటం నిజమే గనుగ ఐతే ఇందులో కూడా పేదవాడికి భంగపాటు తప్పదు. కోట్లకు పడగలెత్తినవారు హత్యలు చేసి శిక్షపడకుండా చేస్తే దేవునికి వేలకోట్లు కానుకగా సమర్పిస్తానని మొక్కుకుంటే.. వేలకోట్ల అవినీతి కేసునుంచి బయటపడేలా చూస్తే దేవునికి వజ్రకిరీటం చేయిస్తాను స్వామి అని మొక్కుకుంటే.. ముఖ్యమంత్రిని చేస్తే వజ్రవైఢూర్యాలు సమర్పిస్తానని రౌడీ రాస్కెల్ మొక్కుకుంటే ఏమౌతుంది..? నిరుపేదలకు అన్యాయం.. ధనవంతులకు న్యాయం జరుగుతుంది. ఈ లెక్కన చూస్తే ‘స్వామి’నీ కొనగల ‘ధనస్వాములు’ ఎందరో ఉన్నారు. నెత్తిన రూపాయి బిళ్ళ పెడితే.. అర్ధరూపాయి విలువ కూడా చేయని బేవార్సుగాళ్ళెందరో అక్రమంగా కోటానుకోట్లు సంపాదించారు. ఇలాంటి వాళ్ళలో చాలామటుకు దేవుళ్ళకు లెక్కలేనంతగా ధన, కనక, వస్తురూపంలో కానుకలు సమర్పిస్తున్న వారూ ఉన్నారు. ఈ విధంగానైతే అక్రమంగా వేలకోట్లు సంపాదించినోడు దేవునికి కానుకగా వందలకోట్లు సమర్పించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అమ్ముడుపోవాలే గానీ ‘స్వాములను’ కొనడం ‘ధనస్వాములకు’ రూపాయితో పెట్టిన విద్య.
Tuesday, May 29, 2012
మితమే హితం..!
“అతి అన్నింటా అనర్థమే” అన్నది అనాదిగా మన పెద్దలు చెబుతూ వస్తున్నదే..! ఐతే అప్పుడూ ఇప్పుడూ అనే తేడా లేకుండా ఏకాలంలోనైనా మనుషులు చెడును గ్రహించినంతగా వేగంగా మంచిని ఒంట బట్టించుకోలేకపోవడం ప్రధానమైన చెడు లక్షణం. ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు వస్తుంది. తీపి ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వ్యాధి వస్తుంది. కాఫీ, టీలు ఎక్కువగా తాగితే ఆకలి మందగిస్తుంది. ఇది సాధారణంగా అందరి నోటా వినిపించే మాట. అంటే అవన్నీ ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట. మరైతే అవన్నీ విషపూరితలా..? ముమ్మాటికీ కానేకాదు.! సూక్ష్మంలో మోక్షం అన్నట్టు.. ప్రశ్నలోనే జవాబు ఉన్నట్టు.. మంచికీ చెడుకీ-పిచ్చోడికి మేథావికి వెంట్రుకవాసి తేడానే ఉంటుంది. ఇది మంచీ, ఇది చెడూ అని దేన్నీ వెంటనే తేల్చిపారేయలేం. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మంచి చెడులనేవి ఉంటాయి. కాకపోతే ఏది ఎంత కావాలో అంతే తీసుకుంటేనే మంచిది. లేకపోతే అది చెడుకు దారి తీస్తుంది. ఈ విషయాన్ని ఇందులో అందులో, దానికీ దీనికీ అంటూ హద్దులు కూడా లేవు. డబ్బు, తిండి, నిద్ర ఇలా మానవ జీవితంలోని సమస్త విషయాలకూ ఇది వర్తిస్తుంది. తిండి విషయానికొస్తే అతిగా తింటే ఊబకాయం.. లేదంటే బలహీనం. అస్తమానం కుంభకర్ణుడిలా నిద్రపోతే మెదడుతోపాటు శరీరం కూడా మొద్దుబారి పోతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైంది డబ్బు. ప్రపంచ వ్యాప్తంగా మనుషులంతా దీనికోసమే రేయి పగలూ అన్న తేడా లేకుండా కష్టపడిపోతూ.. తన జీవితాన్ని తాను జీవించడమన్నదే స్పృహలో లేకుండా పోయారు. ఈ డబ్బు సంపాదించాలన్న యావలో పడిన మనుషులు అసలు జీవితమంటే ఏమిటి? ఎందు కోసం జీవిస్తున్నాం? ఏది పొందుతున్నాం? ఏది కోల్పోతున్నాం? అన్న విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనంతగా కష్టపడిపోతున్నారు. ఈ ధనాన్ని పోగేసుకునే క్రమంలో బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలూ, మానవత్వం అన్నీ కోల్పోతున్నారు. ఒకరికి కష్టమొస్తే ఆపన్నహస్తం అందించడం, పక్కవారు విజయం సాధిస్తే అభినందించడం ఇలాంటి మనుషులకు మాత్రమే సహజ సిద్ధంగా వచ్చే స్పందనలు. ఇవన్నీ నేటి సమాజంలో దాదాపు అడుగంటిపోయాయి. ‘మనిషి జీవితం గాలి బుడగలాంటిది’. ఇది వేదాంతంలాగా అనిపించినా నగ్నసత్యం. ఏ మనిషి ఎంత కాలం బతుకుతాడో ఖచ్చితంగా ఎవ్వరూ లెక్కకట్టలేరు. ఇది అందరూ ఒప్పుకుని తీరే విషయం. మరలాంటప్పుడు మనుషులుగా మనం అవసరానికి మించిన డబ్బు సంపాదనకోసం ఎందుకు వెంపర్లాడుతున్నామో ప్రతి ఒక్కరం ఒక్కసారైనా ఆలోచించుకోవాలి. దీని గురించి చెప్పడానికి పురాణాలో, ఇతిహాసాలో, వేదాంతమో, ఆధ్యాత్మికమో కూడా అవసరం లేదు. అలాంటివి ప్రస్తావించినా బుర్రకెక్కే పరిస్థితులు కూడా లేవు. ఉదాహరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విషయాన్ని తీసుకుంటే.. ఆయన పదవీ కాలంలో వేలకోట్ల రూపాయలు కూడబెట్టారన్నది ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆరోపించగా.. సిబిఐ ఏకంగా ఆయన కుమారున్ని కటకటాల్లోకి నెట్టింది. వీరందరి ఆరోపణలూ నిజమే ఐతే..! అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించగలిగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ సిరిసంపదలను చివరి దాకా అనుభవించే ప్రాప్తం లేకుండా ప్రమాదవశాత్తూ మరణించారు. ఇకపోతే బెంగుళూరులో ‘వైట్‌హౌస్’ను తలపించే భవంతి నిర్మించుకున్న ఆయన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజూ ప్రశాంతంగా ఆ శ్వేత సౌధంలో సేదదీరినట్లు కనిపించడం లేదు. మొన్నటిదాకా ఎండల్లో ఓదార్పు యాత్ర చేస్తే... ఇప్పుడు తనవారంతా ఆయనున్న జైల్లో ఓదార్చే కార్యక్రమం. ఇది చెప్పడానికి వైఎస్‌నే ఎందుకు ఉదాహరణ అంటే.. అందరూ చెప్పిన పాతవిషయాన్నే మళ్ళీ చెబితే.. పాతచింతకాయ పచ్చడో.. కథలూ.. కాకరకాయలనో కొట్టిపారేస్తారు కాబట్టి. కరెంట్ ఇష్యూ ఐతే మరింత వేగంగా బుర్రకెక్కుతుందేమోనన్న చిన్న ఆశ. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ డబ్బు, తిండి, నిద్ర కావాలి. అవన్నీ ఎంతమేరకు కావాలో అంతే కావాలి.. అవసరానికి మించిందేదీ సుఖాన్నివ్వకపోగా కష్టాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి మితమే.. హితం..! సర్వేజనా సుఖినోభవంతు.
Monday, May 28, 2012
వెన్నెముక లేని ‘సంకీర్ణం’
ఏకపార్టీపాలనకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. కాబట్టి వాటి ప్రస్తావనకూడా అనవసరం. ఎందుకంటే కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఐతే ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాల యుగం కొనసాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వ పాలనంటే ప్రజలకు మహర్దశగా భావించొచ్చు.. కానీ వాస్తవంలో అది తారుమారైంది. ప్రజల పాలిట శనిలాగా తయారైంది. భావసారూప్యం గల పార్టీలన్నీ చేతులు కలిపి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటున్నాం. ఇలాంటి పార్టీల వల్ల ప్రజలకు సుపరిపాలన అందాలి. కానీ.. ఖర్మ కొద్దీ మనం ఇప్పటి వరకూ చూసిన ఎన్డీఏ, యూపీఏ కూటములు వెన్నెముకలేని సంకీర్ణ ప్రభుత్వాలే. సంకీర్ణ ప్రభుత్వం తనకాళ్ళ మీద తాను నిలబడలేకపోతోంది. స్వతహాగా ఏనిర్ణయం తీసుకోవాలన్నా ధైర్యం చేయలేని పరిస్థితి. భాగస్వామ్య పక్షాల బెదిరింపులకు బెంబేలెత్తిపోయే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాలుగా చేతులు కలిపాగా పాలనా పరంగా ప్రతిఒక్కరూ సహాయ, సహకారాలు అందిస్తూ, పట్టు విడుపు ధోరణి వహించడం చాలా అవసరం. అలా చేయకపోగా బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. ఈ దరిద్రం మనకు ఇప్పట్లో వదిలేలా లేదు. మనకున్న ప్రధాన జాతీయ పార్టీల్లో, ఏపార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే పరిస్థితిలేదు. కాబట్టి అధికారం కోసం అండగా వచ్చే అడ్డమైన పార్టీలను కలుపుకుని తుమ్మితే ఊడే ముక్కులాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒక సంస్కరణ అమలుచేయాలన్నా, ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా, రాష్ట్ర పతి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నా భాగస్వామ్య పక్షాలదే పైచేయిగా నిలుస్తోంది. ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. వీరిని బుజ్జగింజి దారికి తెచ్చుకునే సరికి తల ప్రాణం తోకకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో ఒకరు ముందుకు లాగితే మరొకరు వెనక్కు గుంజుతున్నారు. అడపాదడపా ధైర్యం చేసి సొంత నిర్ణయాలు తీసుకున్నా భాగస్వామ్య పక్షాలకు నచ్చకపోతే వాటిని వెనక్కి తీసుకోవడం తప్ప వేరేమి చేయలేని పరిస్థితి. మొన్నామధ్య భాగస్వామ్య పక్షం ఆగ్రహించడంతో ఏకంగా రైల్వే మంత్రినే మార్చేయాల్సి వచ్చింది. మన దేశంలో ౬౦ ఏళ్ళుగా పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తోంది. ఇటీవల వజ్రోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ వ్యవస్థను ఏఒక్కరూ తప్పుపట్టలేరు. కానీ చిక్కంతా వ్యక్తుల వల్లే వస్తోంది. స్వతంత్రం పొందాక ఇన్నేళ్ళ మన ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీలేదు. పార్లమెంటులోగానీ, రాజ్యసభలోగానీ మన నేతలు వాకౌట్లు, వాగ్వాదాలు, నిరసనలు చేస్తూ సమయం, డబ్బు వృధా చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరోజూ చట్టసభల్లో ప్రజకోసం సరైన చర్చలు జరపడం గానీ, నిర్ణయాలు తీసుకోవడంగానీ జరగడం లేదు.
ఈ నేపథ్యంలో కూటమిగా జతకట్టే భాగస్వామ్య పక్షాలు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బాధ్యతా యుతంగా మెలగాల్సిన అవసరం చాలా ఉంది. ౧౯౯౬నుంచి ౨౦౦౪ వరకూ భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో సాగిన సంకీర్ణ పాలన, ౨౦౦౪ నుంచి ఇప్పటివరకూ కొనసాగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ పాలనగానీ భాగస్వామ్య పక్షాలను కాదని సొంత నిర్ణయాలతో పాలన సాగించలేకపోవడం గమనార్హం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు పాలనా వ్యవస్థపై విరక్తికలిగే విధంగా నాయకులు ప్రవర్తిస్తే.. ఊహించని విప్లవాలకు దారి తీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనికి పరిష్కారం కావాలంటే రాజకీయాల్లోకి కొత్తనీరు రావాలి.. చిత్తశుద్ధితో ప్రజాసేవకు అంకితమయ్యే నిస్వార్థ రాజకీయ నాయకులు పుట్టుకురావాల్సిందే.. అంతవరకూ సొంత కాళ్ళ మీద నిలబడలేని వెన్నెముక లేని సంకీర్ణ ప్రభుత్వాలను భరించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.
నల్లధనంపై ‘తెల్ల’కాగితం!
నల్లధనంపై మన ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం సార్థక నామధేయం అన్నట్టుగా తెల్లకాగితమే.. బోడిగుండుకూ కోడి గుడ్డుకు ముడేసినట్టు చిత్ర విచిత్రంగా వుంది. అందులో చెప్పుకోదగ్గ విషయం లేదు. కొద్దోగొప్పో ఉన్నది కూడా సంపూర్ణంగానూ లేదు. మన దేశస్థులు అక్రమంగా సంపాదించిన సొమ్మును స్విస్ బ్యాంక్ లాకర్లలో దాచుకుంటున్నారని ఎన్నో దశాబ్దాల నుంచీ ప్రచారం సాగుతోంది. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు, వీరంతా ఎంత డబ్బును అక్కడకు చేరవేశారనేవి ఇప్పటివరకూ ‘లెక్క’కందని ప్రశ్నలే.. రమారమి.. సుమారు.. ఇంచుమించు.. దాదాపు అని చెప్పుకునే ‘లెక్క’ ప్రకారం చేసే ఊహాగానాలే లక్షల కోట్ల రూపాయల్లో ఉన్నాయి.
నల్లధనంపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఐదు నెలల అనతి కాలంలోనే వెల్లడించడం చిత్రంగా తోస్తుంటే.. అందులో ఎలాంటి వివరాలూ లేకపోవడం మరింత విచిత్రంగా ఉంది. ఈ శ్వేత పత్రంలో ఎవరెవరు ఎంతెంత బ్లాక్ మనీ దాచారో చెప్పకపోగా.. ఇప్పటికే వెల్లడయినా వారి పేర్లుగానీ, వారి ఆ లెక్కలకు సంబంధించిన వివరాల ఊసుగానీ లేకపోవడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ వివరాలను బయటికి వెల్లడించడానికి మనం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు అడ్డంకిగా ఉన్నాయన్నది ప్రభుత్వ వాదన. ఇలాగైతే మనకు ముందరి కాళ్ళకు బంధాల్లాంటి ఒప్పందాలు దాదాపు వంద దేశాలతో ఉంటాయి. ఈ లెక్కన ధన దాహం తీరని మోసగాళ్ళు మన వాళ్ళ డొక్కలు ఎండుతుంటే పరాయి దేశాల బొక్కసాలు నింపుతున్నారు. ఇలా దాచుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మన దేశంలో ఉన్న కుభేరుల నల్లధనాన్ని పక్కనబెట్టి మామూలు డబ్బునే మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు, దాన, ధర్మాలు చేపట్టినా చాలు… యాచకులు, నిరుపేదలకు మంచి జీవితాన్ని అందివ్వొచ్చు. సంపన్నులు నివశించే భవంతుల్లో వుండే బాత్రూమ్‌లంత గూడు కూడా లేని నిర్భాగ్యులెందరో ఉన్నారు. జీవితాంతం కష్టపడ్డా పూటగడవని కుటుంబాలెన్నో ఉంటే.. మోసాలు, కుట్రలు చేస్తూ తరతరాలు తిన్నా తరగని సంపద కూడబెట్టుకుంటున్నారు. నీతి నిజాయితీకి కట్టుబడి కష్టపడే పేదలు మరింత పేదలుగా మారుతుంటే… చట్టాలకు చిక్కకుండా తెలివిగా నేరాలకు పాల్పడే బలిసినోళ్ళు మరింతగా బలుస్తున్నారు. లంచావతారమెత్తే ప్యూన్లుకూడా ప్యాలెస్‌లు కట్టేస్తుంటే.. సూరీలు, భానూలు, దావూద్ ఇబ్రహీంలాంటి డాన్లు, ఇలాంటివాళ్ళను తెరవెనుక ఉంటూ నడిపించే పొలిటీషియన్లు ఎంతెంత కొల్లగొట్టి రహస్య ఖాతాల్లో దాచేస్తున్నారో లెక్క తేల్చడం అంత సులభం కాదు. ఇప్పుడే కాదు.. ఈ ప్రభుత్వమే కాదు.. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా బ్లాక్‌మనీపై పూర్తి వివరాలు బయట పెడతాయని ఆశించడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే.. నేరస్తులకే శిక్ష విధించే అధికారమిచ్చినట్లుంది పరిస్థితి. ఎలా చూసినా ఈ బ్లాక్‌మనీ వ్యవహారం బేతాళ కథను తలపిస్తుందేకానీ చిక్కుముడి వీడే అవకాశాలు మచ్చుకైనా కనిపించవు.
Friday, May 18, 2012
కరపత్రికా పోరాటం..!
ప్రజా సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఆనందాల కేరింతలను పాత్రికేయలు రాస్తే, అచ్చేసే వాటిని వార్తా పత్రికలు అంటారు. కానీ.. సొంతలాభానికి, సొంతగోడును ‘అచ్చోసి’ వదిలేవి కరపత్రాలు అవుతాయి గానీ వార్తపత్రికలు ఎలా అవుతాయి..? వారివారి బాధలన్నింటినీ జర్నలిజం బాధలుగా గగ్గోలు చేయడం మహా విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో అస్సలు వార్తాపత్రికలనేవి ఉన్నాయా..? ఉంటేగింటే ఆస్థాన పత్రికలు లేదా కరపత్రికలు మాత్రమే కనబడుతున్నాయి. పత్రికల పగ్గాలు పాత్రికేయుల చేతిలోనుంచి వ్యాపారుల, రాజకీయనేతల చేతుల్లోకి వెళ్ళాయో ఆనాడే దాదాపు గా అసలుసిసలైన మీడియా కనుమరుగైందనే చెప్పాలి. పెట్టుబడిదారులు నడిపే పత్రికల్లో పనిచేస్తున్నవారిని పనివాళ్ళుగానే చూస్తున్నారుగానీ పాత్రికేయులుగా చూడ్డం లేదు. ప్రపంచీకరణ, అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో అన్నిరంగాల్లోనూ మార్పులు వచ్చినట్టే జర్నలిజంలోనూ మార్పులు వచ్చాయి. ప్రాణాలకు తెగించి పరిశోధనాత్మక వార్తలు, కథనాలు రాసే జర్నలిస్టులు మచ్చుకైనా కనిపించడంలేదు. పెట్టుబడిదారులు నడుపుతున్న పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులకు భావాలున్నా, ప్రజల పక్షాన రాయాలన్న తపన ఉన్నా ఇవేవీ చేయలేని పరిస్థితి. సహజంగానే వ్యాపారస్తుడు తన లాభం చూసుకుంటాడే కానీ.. ఎవరికో సాయం చేయాలన్న తలంపుతో తానెప్పుడూ నష్టపోవాలనుకోడు. తన బాధనే ప్రజల, పాత్రికేయుల బాధగా చూపాలనుకుంటాడు. గతంలో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికమీద దాడి జరిగినప్పుడు ఎలా జరిగిందో.. ప్రస్తుతం సాక్షి మీడియా సంస్థ మీద దాడుల నేపథ్యంలో కూడా అదే జరుగుతోంది. గతంలోనూ, ఇప్పుడే కాదు.. ఇకమీదట కూడా అదేజరుగుతూనే ఉంటుంది. నిజానికి పాత్రికేయులు వారి సొంత సమస్యలమీద ఏనాడు ఇంతగా పోరాడలేదు. నిరసనలు తెలపనూలేదు. దేశమందరి బాధలు రాసే పాత్రికేయులు వారి సమస్యలను పరిష్కరించే చేసేవారికోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి చెప్పుకుంటే పరువు పోతుంది.. లేకుంటే ప్రాణంపోతుంది అన్నట్లుంది పాత్రికేయుల దుస్థితి. నేటికాలంలో జర్నలిస్టులు రాస్తున్న రాతలు కానీ, చేస్తున్న ఆందోళనలు గానీ స్వతహా వాళ్ళ మెదళ్ళు చెప్పినట్లు చేస్తున్నవి కాదు. వారంతా రాయబడుతున్నారు, చేయబడుతున్నారు. జర్నలిజం, పాలిటిక్స్ పాలూ నీళ్ళలా కలగలిసిపోయాయి. నేడు ఏది రాజకీయమో ఏది జర్నలిజమో పోల్చుకోవడం అంత తేలిక కాదు. రాజకీయ నాయకుల కష్టాలు మీడియా కష్టాలవుతున్నాయి. వారి స్వేచ్ఛే మీడియా స్వేచ్ఛగా మారిపోయింది. ఒక చిన్న ఉదాహరణ.. ఒకానొక సమయంలో ఒక పాత్రికేయుని ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పేరుతో ఇంటికి పిలిచి తన్నిపంపాడు.. బావిలో కప్పలాగా డెస్క్‌లో ఉండే ఒక సబ్-ఎడిటర్ ఆ వార్తను టాబ్లాయిడ్‌లో కలర్‌పేజీలో పెట్టాడు. అది చూసిన ఆ పత్రిక ఎడిటర్ ఈ వార్తను ఎవరు పెట్టమన్నారయ్యా..? తీసెయ్ అని ఆర్డర్.. అదేంటి తన్నులు తిన్నది మన విలేకరే కదా సార్ అని సబ్-ఎడిటర్ సమాధానం ఇవ్వగా... నిజమే తన్నిందికూడా మన పార్టీ ఎమ్మెల్యేనే లేవయ్యా చెప్పింది విని ఆ వార్తను తీసెయ్. అన్నారు ఎడిటర్‌గారు. ఇదీ పరిస్థితి. రౌడీలు, గూండాలే రాజకీయనాయకులు కాగలుగుతున్నారు. ఇలాంటి వారే పత్రికాధిపతులుగా ఉన్న సమాజంలో పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల హక్కులు ఉంటాయనుకోవడమంత మూర్ఖత్వం మరోటి ఉండదు. ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పత్రికను నడుపుతుంటే అవి ఆస్థానపత్రికలవుతాయి గానీ.. వార్తాపత్రికలు ఎలా అవుతాయి..? పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వారి సమస్యలు, హక్కుల కోసం యజమానులతో పోరాడతున్నారుగానీ, పాత్రికేయుల్లో ఆ మాత్రం కూడా పోరాట పటిమ కనిపించదు. తమ యజమానులకు జ్వరమొస్తే పాత్రికేయులు వణికిపోవడం, వారికి కష్టనష్టాలు ఎదురైతే వీరు రోడ్లక్కెడం షరా మామూలైపోయింది. చాపకింద నీరులా రిలయన్స్ అధినేతలవంటి దిగ్గజాలు మీడియా రంగాన్ని ఆక్రమించేస్తున్నారు. మీడియా పరిస్థితి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగానూ, అసహ్యంగానూ ఉంటుంది.
Saturday, March 17, 2012
తెలుగు వారికి ఇంగ్లీషు తెగులు
తెలుగు రాష్ర్ట్రంలో తెలుగు మాటాడ్డం నేరమా..? దేష భాషలందు తెలుగు లెస్స, తేనెలొలుకు తెలుగు అన్న పెద్దల మాటలు అంతగా చేదెక్కాయా..?
ఆంధ్రప్రదేష్ లో తెలుగు భాష తీరు తెన్నులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది ఇటీవల విషఖపట్నంలోని ఒక పాఠశాలలో నాలుగో తరగతి పాప తెలుగులో సమాధానం చెప్పిందని వాతలు పడేలా కొట్టాడు ఓ ప్రిన్సిపల్. మాతృ భాషను అవమానించడమంటే కన్నతల్లిని అవమానించినట్లే. ఇలాంటి వారివల్లే అమ్మా, నాన్నా పదాల స్థానంలో మమ్మీ డాడీలు చేరాయి. ఇప్పుడు తల్లి దండ్రుల ధోరని కూడా ఇలాగే ఉంది. తమ పిల్లలు ఇంగ్లీష్ నే తిని, ఇంగ్లీష్ నే తాగి, ఇంగ్లీష్ లోనే ఆలోచించాలన్నట్టుగా ఉంది. ఇంగీష్ లో మాట్లాడారంటే మహా ఘనకార్యం సాధించినంత సంభరపడిపోతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుతూ పాపాయిలకు గోరు ముద్దలు తినిపించే తల్లులు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇప్పటి పిల్లలకు ఇంగ్లీష్ రైం స్ తప్ప తెలుగు పాటలంటేనే తెలియని పరిస్థితి. నేటి ఆధునిక యుగంలో తెలుగు మీడియంలో చదివే వారంటే చిన్న చూపు, తెలుగు మాట్లాడాలంటే చిన్నతనం. అసలు ఇంగ్లిష్ తెలియక పోతే మనిషే వృధా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అధికారుల దగ్గర నుంచి ప్రజల దాకా అందరూ తెలుగు భాషను నిర్లక్ల్ష్యం చేస్తూనే ఉన్నారు. అన్నె కార్యాలయాల్లోనూ తెలుగులోనే వుత్తర ప్రత్యుత్తరాలు నడపాల్సి ఉన్నా అది ఎవరూ పాటించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర రాజధానితో పాటు రాస్ట్రంలోని ఏ మూల చూసినా సగానికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు హూటల్లు, దుకానాల బోర్డులన్ని ఇంగ్లీష్ లోనే కనిపిస్తాయి. ఒక వేల తెలుగులో ఉన్నా అచ్చు తప్పుల్లేని రాతలే కనిపించడం లేదు. దాదాపు చాలా మంది డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా స్పష్టంగా తెలుగులో రాయలేని వాల్లున్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించి తెలుగులో రాయడం, మాట్లాడ్డం నేర్చుకుని తెలుగు కోసం పాటుపదిన సిపి బ్రౌన్ వటి విదేశీయులను చూసైనా మనవాళ్ళు బుద్ది తెచ్చుకోవాలి. పరభాషా వ్యామోహంలో పది మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నామన్న సంగతి గుర్తించలేకున్నారు తెలుగు వారు. ఏ దేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భరతిని అన్న పెద్దల మాటల్ని పెడచెవిన పెడితే తెలుగుకు వెలుగుల సంగతేమో కానీ భవిష్యత్ అంధకారమయం కావడం తథ్యం.. తెలుగు భాష విషయంలో తెలుగు భాషా సంఘం కూడా పూర్తి స్థాయిలో ఈమి చేలలేని పరిస్థితులేమిటో కూడా అర్థం కావడం లేదు. తెలుగు భాషా సంఘానికి తలపండిన మేథావులు అధ్యక్షత వహించినా కూడా పరిస్థితులు మెరుగుపడక పోవడం బాధాకరం. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, అధికారులు కళ్ళు తెరిచి తెలుగు భషను బతికించుకోవడానికి పూనుకోకుంటే మన ఉనికి నాశనానికి మనమే కారకులమౌతాం. ఇదే జరిగితే.. మనల్ని భవిష్యత్ తరాలు ఎన్నటికీ క్షమించవు.
నవ కలం పేరుతో మార్చ్ 15- 2012న న్యూస్9 దినపత్రికలో అచ్చయినది.
Subscribe to:
Posts (Atom)


