Tuesday, May 29, 2012

మితమే హితం..!


“అతి అన్నింటా అనర్థమే” అన్నది అనాదిగా మన పెద్దలు చెబుతూ వస్తున్నదే..! ఐతే అప్పుడూ ఇప్పుడూ అనే తేడా లేకుండా ఏకాలంలోనైనా మనుషులు చెడును గ్రహించినంతగా వేగంగా మంచిని ఒంట బట్టించుకోలేకపోవడం ప్రధానమైన చెడు లక్షణం. ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు వస్తుంది. తీపి ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వ్యాధి వస్తుంది. కాఫీ, టీలు ఎక్కువగా తాగితే ఆకలి మందగిస్తుంది. ఇది సాధారణంగా అందరి నోటా వినిపించే మాట. అంటే అవన్నీ ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట. మరైతే అవన్నీ విషపూరితలా..? ముమ్మాటికీ కానేకాదు.! సూక్ష్మంలో మోక్షం అన్నట్టు.. ప్రశ్నలోనే జవాబు ఉన్నట్టు.. మంచికీ చెడుకీ-పిచ్చోడికి మేథావికి వెంట్రుకవాసి తేడానే ఉంటుంది. ఇది మంచీ, ఇది చెడూ అని దేన్నీ వెంటనే తేల్చిపారేయలేం. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మంచి చెడులనేవి ఉంటాయి. కాకపోతే ఏది ఎంత కావాలో అంతే తీసుకుంటేనే మంచిది. లేకపోతే అది చెడుకు దారి తీస్తుంది. ఈ విషయాన్ని ఇందులో అందులో, దానికీ దీనికీ అంటూ హద్దులు కూడా లేవు. డబ్బు, తిండి, నిద్ర ఇలా  మానవ జీవితంలోని సమస్త విషయాలకూ ఇది వర్తిస్తుంది. తిండి విషయానికొస్తే అతిగా తింటే ఊబకాయం.. లేదంటే బలహీనం. అస్తమానం కుంభకర్ణుడిలా నిద్రపోతే మెదడుతోపాటు శరీరం కూడా మొద్దుబారి పోతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైంది డబ్బు. ప్రపంచ వ్యాప్తంగా మనుషులంతా దీనికోసమే రేయి పగలూ అన్న తేడా లేకుండా కష్టపడిపోతూ.. తన జీవితాన్ని తాను జీవించడమన్నదే స్పృహలో లేకుండా పోయారు. ఈ డబ్బు సంపాదించాలన్న యావలో పడిన మనుషులు అసలు జీవితమంటే ఏమిటి? ఎందు కోసం జీవిస్తున్నాం? ఏది పొందుతున్నాం? ఏది కోల్పోతున్నాం? అన్న విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనంతగా కష్టపడిపోతున్నారు. ఈ ధనాన్ని పోగేసుకునే క్రమంలో బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలూ, మానవత్వం అన్నీ కోల్పోతున్నారు. ఒకరికి కష్టమొస్తే ఆపన్నహస్తం అందించడం, పక్కవారు విజయం సాధిస్తే అభినందించడం ఇలాంటి మనుషులకు మాత్రమే సహజ సిద్ధంగా వచ్చే స్పందనలు. ఇవన్నీ నేటి సమాజంలో దాదాపు అడుగంటిపోయాయి. ‘మనిషి జీవితం గాలి బుడగలాంటిది’. ఇది వేదాంతంలాగా అనిపించినా నగ్నసత్యం. ఏ మనిషి ఎంత కాలం బతుకుతాడో ఖచ్చితంగా ఎవ్వరూ లెక్కకట్టలేరు. ఇది అందరూ ఒప్పుకుని తీరే విషయం. మరలాంటప్పుడు మనుషులుగా మనం అవసరానికి మించిన డబ్బు సంపాదనకోసం ఎందుకు వెంపర్లాడుతున్నామో ప్రతి ఒక్కరం ఒక్కసారైనా ఆలోచించుకోవాలి. దీని గురించి చెప్పడానికి పురాణాలో, ఇతిహాసాలో, వేదాంతమో, ఆధ్యాత్మికమో కూడా అవసరం లేదు. అలాంటివి ప్రస్తావించినా బుర్రకెక్కే పరిస్థితులు కూడా లేవు. ఉదాహరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విషయాన్ని తీసుకుంటే.. ఆయన పదవీ కాలంలో  వేలకోట్ల రూపాయలు కూడబెట్టారన్నది ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆరోపించగా.. సిబిఐ ఏకంగా ఆయన కుమారున్ని కటకటాల్లోకి నెట్టింది. వీరందరి ఆరోపణలూ నిజమే ఐతే..! అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించగలిగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ సిరిసంపదలను చివరి దాకా అనుభవించే ప్రాప్తం లేకుండా ప్రమాదవశాత్తూ మరణించారు. ఇకపోతే బెంగుళూరులో ‘వైట్‌హౌస్’ను తలపించే భవంతి నిర్మించుకున్న ఆయన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజూ ప్రశాంతంగా ఆ శ్వేత సౌధంలో సేదదీరినట్లు కనిపించడం లేదు. మొన్నటిదాకా ఎండల్లో ఓదార్పు యాత్ర చేస్తే... ఇప్పుడు తనవారంతా  ఆయనున్న జైల్లో ఓదార్చే కార్యక్రమం. ఇది చెప్పడానికి వైఎస్‌నే ఎందుకు ఉదాహరణ అంటే.. అందరూ చెప్పిన పాతవిషయాన్నే మళ్ళీ చెబితే.. పాతచింతకాయ పచ్చడో.. కథలూ.. కాకరకాయలనో కొట్టిపారేస్తారు కాబట్టి. కరెంట్ ఇష్యూ ఐతే మరింత వేగంగా బుర్రకెక్కుతుందేమోనన్న చిన్న ఆశ.  ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ డబ్బు, తిండి, నిద్ర కావాలి. అవన్నీ ఎంతమేరకు కావాలో అంతే కావాలి.. అవసరానికి మించిందేదీ సుఖాన్నివ్వకపోగా కష్టాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి మితమే.. హితం..! సర్వేజనా సుఖినోభవంతు.

Monday, May 28, 2012

వెన్నెముక లేని ‘సంకీర్ణం’


ఏకపార్టీపాలనకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. కాబట్టి వాటి ప్రస్తావనకూడా అనవసరం. ఎందుకంటే  కేంద్రంలో  ఒకే పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు.  ఐతే ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాల యుగం కొనసాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వ పాలనంటే ప్రజలకు మహర్దశగా భావించొచ్చు.. కానీ వాస్తవంలో అది తారుమారైంది. ప్రజల పాలిట శనిలాగా తయారైంది. భావసారూప్యం గల పార్టీలన్నీ చేతులు కలిపి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటున్నాం. ఇలాంటి పార్టీల వల్ల ప్రజలకు సుపరిపాలన అందాలి. కానీ.. ఖర్మ కొద్దీ మనం ఇప్పటి వరకూ చూసిన ఎన్డీఏ, యూపీఏ కూటములు వెన్నెముకలేని సంకీర్ణ ప్రభుత్వాలే. సంకీర్ణ ప్రభుత్వం తనకాళ్ళ మీద తాను నిలబడలేకపోతోంది. స్వతహాగా ఏనిర్ణయం తీసుకోవాలన్నా ధైర్యం చేయలేని పరిస్థితి. భాగస్వామ్య పక్షాల బెదిరింపులకు బెంబేలెత్తిపోయే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాలుగా చేతులు కలిపాగా పాలనా పరంగా ప్రతిఒక్కరూ సహాయ, సహకారాలు అందిస్తూ, పట్టు విడుపు ధోరణి వహించడం చాలా అవసరం.  అలా చేయకపోగా బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. ఈ దరిద్రం మనకు ఇప్పట్లో వదిలేలా లేదు.  మనకున్న ప్రధాన జాతీయ పార్టీల్లో, ఏపార్టీకి కూడా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే పరిస్థితిలేదు. కాబట్టి అధికారం కోసం అండగా వచ్చే అడ్డమైన పార్టీలను కలుపుకుని తుమ్మితే ఊడే ముక్కులాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒక సంస్కరణ అమలుచేయాలన్నా, ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా, రాష్ట్ర పతి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నా భాగస్వామ్య పక్షాలదే పైచేయిగా నిలుస్తోంది. ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. వీరిని బుజ్జగింజి దారికి తెచ్చుకునే సరికి తల ప్రాణం తోకకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో ఒకరు ముందుకు లాగితే మరొకరు వెనక్కు గుంజుతున్నారు. అడపాదడపా ధైర్యం చేసి సొంత నిర్ణయాలు తీసుకున్నా భాగస్వామ్య పక్షాలకు నచ్చకపోతే వాటిని వెనక్కి తీసుకోవడం తప్ప వేరేమి చేయలేని పరిస్థితి. మొన్నామధ్య భాగస్వామ్య పక్షం ఆగ్రహించడంతో ఏకంగా రైల్వే మంత్రినే మార్చేయాల్సి వచ్చింది. మన దేశంలో ౬౦ ఏళ్ళుగా పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తోంది. ఇటీవల వజ్రోత్సవాలు కూడా  ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ వ్యవస్థను ఏఒక్కరూ తప్పుపట్టలేరు. కానీ చిక్కంతా వ్యక్తుల వల్లే వస్తోంది. స్వతంత్రం పొందాక ఇన్నేళ్ళ మన ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీలేదు. పార్లమెంటులోగానీ, రాజ్యసభలోగానీ మన నేతలు వాకౌట్లు, వాగ్వాదాలు, నిరసనలు చేస్తూ సమయం, డబ్బు వృధా చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరోజూ చట్టసభల్లో ప్రజకోసం సరైన చర్చలు జరపడం గానీ, నిర్ణయాలు తీసుకోవడంగానీ జరగడం లేదు.
 ఈ నేపథ్యంలో కూటమిగా జతకట్టే భాగస్వామ్య పక్షాలు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బాధ్యతా యుతంగా మెలగాల్సిన అవసరం చాలా ఉంది. ౧౯౯౬నుంచి ౨౦౦౪ వరకూ భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో సాగిన సంకీర్ణ పాలన, ౨౦౦౪ నుంచి ఇప్పటివరకూ కొనసాగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ పాలనగానీ భాగస్వామ్య పక్షాలను కాదని సొంత నిర్ణయాలతో పాలన సాగించలేకపోవడం గమనార్హం.  ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు  పాలనా వ్యవస్థపై విరక్తికలిగే విధంగా నాయకులు ప్రవర్తిస్తే.. ఊహించని విప్లవాలకు దారి తీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనికి పరిష్కారం కావాలంటే రాజకీయాల్లోకి కొత్తనీరు రావాలి.. చిత్తశుద్ధితో ప్రజాసేవకు అంకితమయ్యే నిస్వార్థ రాజకీయ నాయకులు పుట్టుకురావాల్సిందే.. అంతవరకూ సొంత కాళ్ళ మీద నిలబడలేని వెన్నెముక లేని సంకీర్ణ ప్రభుత్వాలను భరించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.

నల్లధనంపై ‘తెల్ల’కాగితం!


నల్లధనంపై మన ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం సార్థక నామధేయం అన్నట్టుగా తెల్లకాగితమే.. బోడిగుండుకూ కోడి గుడ్డుకు ముడేసినట్టు చిత్ర విచిత్రంగా వుంది. అందులో చెప్పుకోదగ్గ విషయం లేదు. కొద్దోగొప్పో ఉన్నది కూడా సంపూర్ణంగానూ లేదు. మన దేశస్థులు అక్రమంగా సంపాదించిన సొమ్మును స్విస్ బ్యాంక్ లాకర్లలో దాచుకుంటున్నారని ఎన్నో దశాబ్దాల నుంచీ ప్రచారం సాగుతోంది. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు, వీరంతా ఎంత డబ్బును అక్కడకు చేరవేశారనేవి ఇప్పటివరకూ ‘లెక్క’కందని ప్రశ్నలే.. రమారమి.. సుమారు.. ఇంచుమించు.. దాదాపు అని చెప్పుకునే ‘లెక్క’ ప్రకారం చేసే ఊహాగానాలే లక్షల కోట్ల రూపాయల్లో ఉన్నాయి.
నల్లధనంపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఐదు నెలల అనతి కాలంలోనే వెల్లడించడం చిత్రంగా తోస్తుంటే.. అందులో ఎలాంటి వివరాలూ లేకపోవడం మరింత విచిత్రంగా ఉంది. ఈ శ్వేత పత్రంలో ఎవరెవరు ఎంతెంత బ్లాక్ మనీ దాచారో చెప్పకపోగా.. ఇప్పటికే వెల్లడయినా వారి పేర్లుగానీ, వారి ఆ లెక్కలకు సంబంధించిన వివరాల ఊసుగానీ లేకపోవడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ వివరాలను బయటికి వెల్లడించడానికి మనం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు అడ్డంకిగా ఉన్నాయన్నది ప్రభుత్వ వాదన. ఇలాగైతే మనకు ముందరి కాళ్ళకు బంధాల్లాంటి ఒప్పందాలు దాదాపు వంద దేశాలతో ఉంటాయి. ఈ లెక్కన ధన దాహం తీరని మోసగాళ్ళు మన వాళ్ళ డొక్కలు ఎండుతుంటే పరాయి దేశాల బొక్కసాలు నింపుతున్నారు. ఇలా దాచుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మన దేశంలో ఉన్న కుభేరుల నల్లధనాన్ని పక్కనబెట్టి మామూలు డబ్బునే మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు, దాన, ధర్మాలు చేపట్టినా చాలు… యాచకులు, నిరుపేదలకు మంచి జీవితాన్ని అందివ్వొచ్చు. సంపన్నులు నివశించే భవంతుల్లో వుండే బాత్రూమ్‌లంత గూడు కూడా లేని నిర్భాగ్యులెందరో ఉన్నారు. జీవితాంతం కష్టపడ్డా పూటగడవని కుటుంబాలెన్నో ఉంటే.. మోసాలు, కుట్రలు చేస్తూ తరతరాలు తిన్నా తరగని సంపద కూడబెట్టుకుంటున్నారు. నీతి నిజాయితీకి కట్టుబడి కష్టపడే పేదలు మరింత పేదలుగా మారుతుంటే… చట్టాలకు చిక్కకుండా తెలివిగా నేరాలకు పాల్పడే బలిసినోళ్ళు మరింతగా బలుస్తున్నారు. లంచావతారమెత్తే ప్యూన్లుకూడా ప్యాలెస్‌లు కట్టేస్తుంటే.. సూరీలు, భానూలు, దావూద్ ఇబ్రహీంలాంటి డాన్లు, ఇలాంటివాళ్ళను తెరవెనుక ఉంటూ నడిపించే పొలిటీషియన్లు ఎంతెంత కొల్లగొట్టి రహస్య ఖాతాల్లో దాచేస్తున్నారో లెక్క తేల్చడం అంత సులభం కాదు. ఇప్పుడే కాదు.. ఈ ప్రభుత్వమే కాదు.. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా బ్లాక్‌మనీపై పూర్తి వివరాలు బయట పెడతాయని ఆశించడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే.. నేరస్తులకే శిక్ష విధించే అధికారమిచ్చినట్లుంది పరిస్థితి. ఎలా చూసినా ఈ బ్లాక్‌మనీ వ్యవహారం బేతాళ కథను తలపిస్తుందేకానీ చిక్కుముడి వీడే అవకాశాలు మచ్చుకైనా కనిపించవు.

Friday, May 18, 2012

కరపత్రికా పోరాటం..!



ప్రజా సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఆనందాల కేరింతలను పాత్రికేయలు రాస్తే, అచ్చేసే వాటిని వార్తా పత్రికలు అంటారు. కానీ.. సొంతలాభానికి, సొంతగోడును ‘అచ్చోసి’ వదిలేవి కరపత్రాలు అవుతాయి గానీ వార్తపత్రికలు ఎలా అవుతాయి..? వారివారి బాధలన్నింటినీ జర్నలిజం బాధలుగా గగ్గోలు చేయడం మహా విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో అస్సలు వార్తాపత్రికలనేవి ఉన్నాయా..?  ఉంటేగింటే ఆస్థాన పత్రికలు లేదా కరపత్రికలు మాత్రమే కనబడుతున్నాయి. పత్రికల పగ్గాలు పాత్రికేయుల చేతిలోనుంచి వ్యాపారుల, రాజకీయనేతల చేతుల్లోకి వెళ్ళాయో ఆనాడే దాదాపు గా అసలుసిసలైన మీడియా కనుమరుగైందనే చెప్పాలి. పెట్టుబడిదారులు నడిపే పత్రికల్లో పనిచేస్తున్నవారిని పనివాళ్ళుగానే చూస్తున్నారుగానీ పాత్రికేయులుగా చూడ్డం లేదు. ప్రపంచీకరణ, అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో అన్నిరంగాల్లోనూ మార్పులు వచ్చినట్టే జర్నలిజంలోనూ మార్పులు వచ్చాయి. ప్రాణాలకు తెగించి పరిశోధనాత్మక వార్తలు, కథనాలు రాసే జర్నలిస్టులు మచ్చుకైనా కనిపించడంలేదు. పెట్టుబడిదారులు నడుపుతున్న పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులకు భావాలున్నా, ప్రజల పక్షాన రాయాలన్న తపన ఉన్నా ఇవేవీ చేయలేని పరిస్థితి. సహజంగానే వ్యాపారస్తుడు తన లాభం చూసుకుంటాడే కానీ.. ఎవరికో సాయం చేయాలన్న తలంపుతో తానెప్పుడూ నష్టపోవాలనుకోడు. తన బాధనే ప్రజల, పాత్రికేయుల బాధగా చూపాలనుకుంటాడు. గతంలో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికమీద దాడి జరిగినప్పుడు ఎలా జరిగిందో..  ప్రస్తుతం సాక్షి మీడియా సంస్థ మీద దాడుల నేపథ్యంలో కూడా అదే జరుగుతోంది. గతంలోనూ, ఇప్పుడే కాదు.. ఇకమీదట కూడా అదేజరుగుతూనే ఉంటుంది. నిజానికి పాత్రికేయులు వారి సొంత సమస్యలమీద ఏనాడు ఇంతగా పోరాడలేదు. నిరసనలు తెలపనూలేదు. దేశమందరి బాధలు రాసే పాత్రికేయులు వారి సమస్యలను పరిష్కరించే  చేసేవారికోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి చెప్పుకుంటే పరువు పోతుంది.. లేకుంటే ప్రాణంపోతుంది అన్నట్లుంది పాత్రికేయుల దుస్థితి. నేటికాలంలో జర్నలిస్టులు రాస్తున్న  రాతలు కానీ, చేస్తున్న ఆందోళనలు గానీ స్వతహా వాళ్ళ మెదళ్ళు చెప్పినట్లు చేస్తున్నవి కాదు. వారంతా రాయబడుతున్నారు, చేయబడుతున్నారు. జర్నలిజం, పాలిటిక్స్ పాలూ నీళ్ళలా కలగలిసిపోయాయి. నేడు ఏది రాజకీయమో ఏది జర్నలిజమో పోల్చుకోవడం అంత తేలిక కాదు. రాజకీయ నాయకుల కష్టాలు మీడియా కష్టాలవుతున్నాయి. వారి స్వేచ్ఛే మీడియా స్వేచ్ఛగా మారిపోయింది. ఒక చిన్న ఉదాహరణ.. ఒకానొక సమయంలో ఒక పాత్రికేయుని ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పేరుతో ఇంటికి పిలిచి తన్నిపంపాడు.. బావిలో కప్పలాగా డెస్క్‌లో ఉండే ఒక సబ్-ఎడిటర్ ఆ వార్తను టాబ్లాయిడ్‌లో కలర్‌పేజీలో పెట్టాడు. అది చూసిన ఆ పత్రిక ఎడిటర్ ఈ వార్తను ఎవరు పెట్టమన్నారయ్యా..? తీసెయ్ అని ఆర్డర్.. అదేంటి తన్నులు తిన్నది మన విలేకరే కదా సార్ అని సబ్-ఎడిటర్ సమాధానం ఇవ్వగా... నిజమే తన్నిందికూడా మన పార్టీ ఎమ్మెల్యేనే లేవయ్యా చెప్పింది విని ఆ వార్తను తీసెయ్. అన్నారు ఎడిటర్‌గారు. ఇదీ పరిస్థితి. రౌడీలు, గూండాలే రాజకీయనాయకులు కాగలుగుతున్నారు. ఇలాంటి వారే పత్రికాధిపతులుగా ఉన్న సమాజంలో పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల హక్కులు ఉంటాయనుకోవడమంత మూర్ఖత్వం మరోటి ఉండదు. ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పత్రికను నడుపుతుంటే అవి ఆస్థానపత్రికలవుతాయి గానీ.. వార్తాపత్రికలు ఎలా అవుతాయి..? పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు  వారి సమస్యలు, హక్కుల కోసం యజమానులతో పోరాడతున్నారుగానీ, పాత్రికేయుల్లో ఆ మాత్రం కూడా పోరాట పటిమ కనిపించదు. తమ యజమానులకు జ్వరమొస్తే పాత్రికేయులు వణికిపోవడం, వారికి కష్టనష్టాలు ఎదురైతే వీరు రోడ్లక్కెడం షరా మామూలైపోయింది. చాపకింద నీరులా రిలయన్స్ అధినేతలవంటి దిగ్గజాలు మీడియా రంగాన్ని ఆక్రమించేస్తున్నారు. మీడియా పరిస్థితి ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగానూ, అసహ్యంగానూ ఉంటుంది.