సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడంలోనూ.. సాహితీవేత్తలను ప్రోత్సహించడంలోనూ ‘మీడియా’ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సాహిత్యం పలుప్రక్రియల ద్వారా జనజీవనంలో మమేకం. ఏ యుగంలోనైనా పేద, ధనిక తారతమ్యం లేకుండా సాహిత్యం అందరికీ అవసరమే. మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో మానసిక ఉల్లాసమూ అంతే అవసరము. ఈ అవసరాన్ని అనాదిగా‘కళ’లు తీరుస్తున్నాయి. ఇందులో కవిత్వ కళ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కవిని శాషన కర్త అనడం అతిశయోక్తి కాదు.. ప్రపంచ బాధను తన బాధగా తలకెత్తుకునేవాడే కవి. భాష విస్తృతానికి, చరిత్ర, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందిండానికి సాహిత్యం ఎంతగానో దోహదపడుతుంది. నేటి హైటెక్ యుగంలో సాహిత్యాని చదివే పాఠకుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. సాహిత్య పఠనం వల్ల భాషలో ప్రావీణ్యాన్ని సాంధించవచ్చు. మహత్తర శక్తిగల సాహిత్యాన్ని ‘మీడియా’ కూడా నిర్లక్ష్యం చేయడం మరింత బాధాకరం. గతంలో కేవలం సాహిత్యం కోసమే పత్రికలను నడిపేవారు. అలాంటిది నేటి దినపత్రికల్లో సాహిత్యానికి సముచిత స్థానం కల్పించకపోవడం తమ భాషను తామే అవమానపరచుకున్నట్లే అవుతుంది. ఉన్నంతలో చెప్పుకోదగ్గ విషయమేమంటే.. సర్క్యులేషన్ తక్కువగా ఉన్నా చిన్నపత్రికలు పూర్తిగా ఒక పేజీనీ సాహిత్యానికి కేటాయిస్తున్నాయంటే అభినందనీయం.
ఈ విషయంలో దినపత్రికలతో పోలిస్తే టెలివిజన్ ఛానెళ్ళు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి. వీటికి సెన్షేన్ వార్తల తర్వాత, సినిమాలు, ఫ్యాషన్ షోలు, మాట్లాడ్డం కూడా చేతకానివాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాలు... ఇలా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని చెత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. కవులను, రచయితలను, వారి కవిత్వాన్ని, రచనల గురించి కార్యక్రమాలు ప్రసారం చేస్తే సమాజ అభివృద్ధి, వికాసానికి ఎంతగానో ఉపయోగకరం. నేడు చాలావరకు పత్రికలు, టివి ఛానెళ్ళు సర్క్యులేషన్, రేటింగ్ పెంచుకోవడం కోసం పాకులాడుతున్నాయేగానీ... సమాజానికి మంచి చేస్తున్నామా..? చెడు చేస్తున్నామా..? అని ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియాగానీ ఆలోచించడం లేదు. అత్యధిక సర్క్యులేషన్‌గల దినపతివ్రిలు కూడా సినిమా పేజీల్లో అసభ్యకర శీర్షికలతో వార్తలు రాస్తున్నారు.. ఇటీవల దినపత్రికల్లోని సినిమా పేజీల్లో వస్తున్న శీర్షికలు ఇలా ఉంటున్నాయి.. “హీరో యిన్లకు అవి లేవు” . ఏవి లేవు..? ఆ అనుభవం మరువలేనిది...? ఎందుకోసం ఇలాంటివి రాస్తున్నారు.. సమాజంలో కొందరు బాధ్యతల్లేని వ్యక్తులు రకరకాల వికృత, వింత పోకడలను అనుసరిస్తుంటారు.. బాధ్యతాయుతమైన మీడియా కూడా అలాంటి బాటలో నడవడం చాలా దారుణమైన విషయం. ప్రింట్/ఎలక్ట్రానిక్ ‘మీడియా’ సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయడమంటే.. సమాజాన్ని పరోక్షంగా పాతాళానికి నెట్టేసినట్లే.. మహోన్నతమైన, ఆదర్శవంతమైన, అత్యుత్తమమైన రచయితలగురించి నేట్బి సమాజంలో ఎంతమందికి తెలుసు. ప్రముఖ కవులను గానీ.. ప్రముఖ జాతీయ నాయకులను గానీ నేడు ఎంతమంది గుర్తించే స్థితిలో ఉన్నారు..
వీటికి సమాధానాలు తెలిస్తే ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి. కనీసం ఈ మాట కూడా చాలా మందికి తెలియదు. నేటి రాజకీయ నాయకులు చేస్తున్నదే గదుల్బాజీ పనులు... అది చాలదన్నట్లు ఛానెళ్ళలో గంటలు తరబడి పనికిరాని, ప్రయోజనం లేని చర్చా కార్యక్రమాలు. వీటివల్ల వీసమెత్తు ఉపయోగమైనా ఉంటోందా..? సమాజంలోని దురాచారాలు, కుసంస్కృతి, లంచగొండితనం, అంటరానితనం, వరకట్నం.. ఇలా సమాజానికి చీడలాంటి విషయాలమీద ఎంతోమంది మహానుభావులు తమ రచనల ద్వారా పోరాడారు. తద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించారు. ఇప్పటి యువతలో చాలా మందికి లేఖ రాయడమే చేతగాదు. అలాంటిది రచనలో ఎన్నెన్ని ప్రక్రియలున్నాయి.. భాషను ఎలా మలుచుకుని, ఎలాంటి రచనలు చేయొచ్చు అన్న విషయాలు బొత్తిగా తెలియదు. మహాద్భుతమైన రచలు అందించిన రచయితల్లో.. సుతిమెత్తగా మొహం మీద మొత్తినట్లు కొందరు రాస్తే.. నీళ్ళు నమలకుండా సూటిగా ముఖం మీద గుద్దినట్టు రాసినవారు కొందరైతే.. వ్యంగ్యంతో వెక్కిరించినవారు, నవ్విస్తూనే.. ఏడ్పించే వారు .. తప్పుడు పనులు చేసినోళ్ళకు పరువుతోపాటు ప్రాణం పోయేవంటి రచనలు చేసిన ఆదర్శ రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి మనం జన్మజన్మలకు రుణపడి ఉంటాం.. అంతటి రచనా సామర్థ్యం, సత్తా, చేవ మనకు లేకపోయినా ఫర్వాలేదుగానీ... కనీసం అలాంటి అమూల్యమైన ‘సాహితీ సంపదను’ కూడా కాపాడుకోలేకపోతున్నామంటే.. క్షమించారని నేరం.. మనందరం సిగ్గుతో తలదించుకోవాలి.
No comments:
Post a Comment