Tuesday, July 3, 2012

ఓడి గెలుస్తారా..? గెలిచి ఓడిస్తారా..?


ఆట ఎప్పుడు మొదలైందో.. ఎలా మొదలైందో సామాన్యులకు అర్థం కావడం లేదుగానీ.. రాజకీయ చదరంగం మాత్రం  రసకందాయంలో పడింది. ఒక్కడి మీద యుద్ధానికి వంద మంది సైన్యం కాలు దువ్వుతున్నారు. అక్షరాలా మహా భారత యుద్ధాన్ని తలపిస్తోంది. అదేదో కాదు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కొనసాగిస్తున్న దాడి.. నిజంగా ఇది హస్తినకు.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న యుద్దంగా అభివర్ణించినా అతిశయోక్తి కాదు... తప్పొప్పులు దోషులకెరుక.. పాపం పుణ్యం దేవుళ్ళకెరుక..! గతంలో తెరవెనుక ఏంజరిగిందో ఖచ్చితంగా ఎవ్వరికీ అంతుబట్టని విషయం. కానీ ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే.. ఇది ముమ్మాటికీ కక్ష్య సాధింపు చర్యేనని ఎంతటి అమాయకున్ని అడిగినా చెప్పేస్తాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జగన్ కలియుగ అభిమన్యుడిలా కనిపిస్తున్నాడు. దీనికి ఉప ఎన్నికల ఫలితాలే కొలమానంగా చెప్పుకోవచ్చు. వీటిని చాలామంది సెంటిమెంట్‌గా కొట్టి పారేస్తున్నారు కానీ.. తండ్రి వల్ల వచ్చిన సానుభూతి యాభై శాతం ఉంటే... కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన అణచివేతల చర్యలవ్ల అది వంత శాతానికి చేరింది.. సానుభూతి కాస్తా ముదిరి అభిమానంగా మారిపోయింది.
కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ఈ యుద్ధం జగన్ దగ్గర నుంచి ప్రారంభించినట్లుగా కనిపిస్తున్నా... వాస్తవానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డినుంచే ప్రారంభించేందేమో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం వెనుకు కుట్ర ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను కూడా అంత ఆశామాషీగా కొట్టిపారేయడానికీ లేదు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలుగానీ.. ఇటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబీకులు గానీ అసలు విషయాన్ని బయట పెట్టకుండానే ముసుగులో గుద్దులాటలాగా వారిలో వారు పోరాడుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్‌తోపాటు ప్రతి పక్ష పార్టీలు, సిబిఐ వారు ఆరోపిస్తున్నట్లుగా వైఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగితే జరిగి ఉండొచ్చేమోగానీ.. ప్రజలు మాత్రం వాటికి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడంలేదు. నేటి రాజకీయాల్లోనూ.. ముఖ్యమంత్రులుగా చేసిన నేతల్లోనూ అవినీతి మలినం అంటని వారెవ్వరూ లేరని.. అలాంటి వారితో పోల్చినా, వైఎస్ తాను దోచుకున్నదంతా దాచుకోకుండా కొంతలో కొంతైనా పంచడంలో అందరికంటే మేలైనవాడనే అభిప్రాయమూ ప్రజల్లో వ్యక్తమవుతోంది. వందేళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీ తమకు ఎదురుతిరిగిన మహామహులనే దారికి తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇందుకోసం సామదానబేద దండోపాయలును ప్రయోగించడంలో కాంగ్రెస్ పార్టీ పేరు గడించింది. అంతటి ఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి జగన్ విషయంలో మాత్రం తన పాచికలు సక్రమంగా పారడంలేదనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తెలివిగా యోచిస్తోందో..? లేక దిక్కు తోచని స్థితిలో ఇష్టానుసారం వ్యవహరిస్తోందో... అర్థం కావడం లేదు. దీన్ని తెలివిగా అర్థం చేసుకోవాలా..? లేక అతి తెలివిగా ఊహించుకోవాలో..?  విశ్లేషకుల కూడా అంతుచిక్కడం లేదు. ఏదేమైనా ‘జీరో’ లాంటి జగన్‌కు మాత్రం దేశవ్యాప్తంగా ‘హీరో’ ఇమేజ్ తెచ్చిపెట్టడంలో కాంగ్రెస్ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉంది. వాస్తవానికి కాంగ్రెస్‌తో విబేధించిన వారు చాలా మందే ఉన్నా.. ఎదురించి నిలబడిన వాళ్ళు మాత్రం అరుదే..! కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలో మార్పు రాకుంటే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కానీ, తన తల్లినిగానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక వేళ భవిష్యత్తులో  జగన్ ముఖ్యమంత్రి అయితే తన తండ్రిలాగే ప్రజాదరణ పొందుతాడా..? లేక రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని కొనసాగిస్తాడా..? అన్నది ఇప్పుడే తేల్చలేని విషయం..  పాతకాలపు
ఫ్యాక్షన్ బాటలో కాకపోయినా.. తాననుకున్నది సాధించడంకోసం  సైలెంట్ కిల్లర్‌గా తనపనులు తాను చేసుకుపోవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌తో జగన్ చేస్తున్న పోరాటం.. బలవంతుడితో బలహీనుడు తలపడినట్లు తలపిస్తోంది.. ఇలాంటి పోరులో బలహీనుడు గెలిస్తే అతిపెద్ద విజయం.. ఓడితే నైతిక విజయం.. మొత్తానికి జగన్ మాత్రం కొండకు వెంట్రుక వేసి లాగుతున్నాడు... వస్తే కొండ, పోతే వెంట్రుక.. అదే గెలుపు తిరగబడితే.. అతిపెద్ద జాతీయ పార్టీ ఘనచరిత్రను కట్టుకున్న మూటలోనే ఈ పరాభావాన్ని మూటగట్టుకోకతప్పదు..!

No comments:

Post a Comment