నల్లధనంపై మన ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం సార్థక నామధేయం అన్నట్టుగా తెల్లకాగితమే.. బోడిగుండుకూ కోడి గుడ్డుకు ముడేసినట్టు చిత్ర విచిత్రంగా వుంది. అందులో చెప్పుకోదగ్గ విషయం లేదు. కొద్దోగొప్పో ఉన్నది కూడా సంపూర్ణంగానూ లేదు. మన దేశస్థులు అక్రమంగా సంపాదించిన సొమ్మును స్విస్ బ్యాంక్ లాకర్లలో దాచుకుంటున్నారని ఎన్నో దశాబ్దాల నుంచీ ప్రచారం సాగుతోంది. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు, వీరంతా ఎంత డబ్బును అక్కడకు చేరవేశారనేవి ఇప్పటివరకూ ‘లెక్క’కందని ప్రశ్నలే.. రమారమి.. సుమారు.. ఇంచుమించు.. దాదాపు అని చెప్పుకునే ‘లెక్క’ ప్రకారం చేసే ఊహాగానాలే లక్షల కోట్ల రూపాయల్లో ఉన్నాయి.
నల్లధనంపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఐదు నెలల అనతి కాలంలోనే వెల్లడించడం చిత్రంగా తోస్తుంటే.. అందులో ఎలాంటి వివరాలూ లేకపోవడం మరింత విచిత్రంగా ఉంది. ఈ శ్వేత పత్రంలో ఎవరెవరు ఎంతెంత బ్లాక్ మనీ దాచారో చెప్పకపోగా.. ఇప్పటికే వెల్లడయినా వారి పేర్లుగానీ, వారి ఆ లెక్కలకు సంబంధించిన వివరాల ఊసుగానీ లేకపోవడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ వివరాలను బయటికి వెల్లడించడానికి మనం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు అడ్డంకిగా ఉన్నాయన్నది ప్రభుత్వ వాదన. ఇలాగైతే మనకు ముందరి కాళ్ళకు బంధాల్లాంటి ఒప్పందాలు దాదాపు వంద దేశాలతో ఉంటాయి. ఈ లెక్కన ధన దాహం తీరని మోసగాళ్ళు మన వాళ్ళ డొక్కలు ఎండుతుంటే పరాయి దేశాల బొక్కసాలు నింపుతున్నారు. ఇలా దాచుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మన దేశంలో ఉన్న కుభేరుల నల్లధనాన్ని పక్కనబెట్టి మామూలు డబ్బునే మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు, దాన, ధర్మాలు చేపట్టినా చాలు… యాచకులు, నిరుపేదలకు మంచి జీవితాన్ని అందివ్వొచ్చు. సంపన్నులు నివశించే భవంతుల్లో వుండే బాత్రూమ్‌లంత గూడు కూడా లేని నిర్భాగ్యులెందరో ఉన్నారు. జీవితాంతం కష్టపడ్డా పూటగడవని కుటుంబాలెన్నో ఉంటే.. మోసాలు, కుట్రలు చేస్తూ తరతరాలు తిన్నా తరగని సంపద కూడబెట్టుకుంటున్నారు. నీతి నిజాయితీకి కట్టుబడి కష్టపడే పేదలు మరింత పేదలుగా మారుతుంటే… చట్టాలకు చిక్కకుండా తెలివిగా నేరాలకు పాల్పడే బలిసినోళ్ళు మరింతగా బలుస్తున్నారు. లంచావతారమెత్తే ప్యూన్లుకూడా ప్యాలెస్‌లు కట్టేస్తుంటే.. సూరీలు, భానూలు, దావూద్ ఇబ్రహీంలాంటి డాన్లు, ఇలాంటివాళ్ళను తెరవెనుక ఉంటూ నడిపించే పొలిటీషియన్లు ఎంతెంత కొల్లగొట్టి రహస్య ఖాతాల్లో దాచేస్తున్నారో లెక్క తేల్చడం అంత సులభం కాదు. ఇప్పుడే కాదు.. ఈ ప్రభుత్వమే కాదు.. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా బ్లాక్‌మనీపై పూర్తి వివరాలు బయట పెడతాయని ఆశించడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే.. నేరస్తులకే శిక్ష విధించే అధికారమిచ్చినట్లుంది పరిస్థితి. ఎలా చూసినా ఈ బ్లాక్‌మనీ వ్యవహారం బేతాళ కథను తలపిస్తుందేకానీ చిక్కుముడి వీడే అవకాశాలు మచ్చుకైనా కనిపించవు.
No comments:
Post a Comment