Tuesday, May 29, 2012

మితమే హితం..!


“అతి అన్నింటా అనర్థమే” అన్నది అనాదిగా మన పెద్దలు చెబుతూ వస్తున్నదే..! ఐతే అప్పుడూ ఇప్పుడూ అనే తేడా లేకుండా ఏకాలంలోనైనా మనుషులు చెడును గ్రహించినంతగా వేగంగా మంచిని ఒంట బట్టించుకోలేకపోవడం ప్రధానమైన చెడు లక్షణం. ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు వస్తుంది. తీపి ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వ్యాధి వస్తుంది. కాఫీ, టీలు ఎక్కువగా తాగితే ఆకలి మందగిస్తుంది. ఇది సాధారణంగా అందరి నోటా వినిపించే మాట. అంటే అవన్నీ ఆరోగ్యానికి హాని చేస్తాయన్నమాట. మరైతే అవన్నీ విషపూరితలా..? ముమ్మాటికీ కానేకాదు.! సూక్ష్మంలో మోక్షం అన్నట్టు.. ప్రశ్నలోనే జవాబు ఉన్నట్టు.. మంచికీ చెడుకీ-పిచ్చోడికి మేథావికి వెంట్రుకవాసి తేడానే ఉంటుంది. ఇది మంచీ, ఇది చెడూ అని దేన్నీ వెంటనే తేల్చిపారేయలేం. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మంచి చెడులనేవి ఉంటాయి. కాకపోతే ఏది ఎంత కావాలో అంతే తీసుకుంటేనే మంచిది. లేకపోతే అది చెడుకు దారి తీస్తుంది. ఈ విషయాన్ని ఇందులో అందులో, దానికీ దీనికీ అంటూ హద్దులు కూడా లేవు. డబ్బు, తిండి, నిద్ర ఇలా  మానవ జీవితంలోని సమస్త విషయాలకూ ఇది వర్తిస్తుంది. తిండి విషయానికొస్తే అతిగా తింటే ఊబకాయం.. లేదంటే బలహీనం. అస్తమానం కుంభకర్ణుడిలా నిద్రపోతే మెదడుతోపాటు శరీరం కూడా మొద్దుబారి పోతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైంది డబ్బు. ప్రపంచ వ్యాప్తంగా మనుషులంతా దీనికోసమే రేయి పగలూ అన్న తేడా లేకుండా కష్టపడిపోతూ.. తన జీవితాన్ని తాను జీవించడమన్నదే స్పృహలో లేకుండా పోయారు. ఈ డబ్బు సంపాదించాలన్న యావలో పడిన మనుషులు అసలు జీవితమంటే ఏమిటి? ఎందు కోసం జీవిస్తున్నాం? ఏది పొందుతున్నాం? ఏది కోల్పోతున్నాం? అన్న విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనంతగా కష్టపడిపోతున్నారు. ఈ ధనాన్ని పోగేసుకునే క్రమంలో బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలూ, మానవత్వం అన్నీ కోల్పోతున్నారు. ఒకరికి కష్టమొస్తే ఆపన్నహస్తం అందించడం, పక్కవారు విజయం సాధిస్తే అభినందించడం ఇలాంటి మనుషులకు మాత్రమే సహజ సిద్ధంగా వచ్చే స్పందనలు. ఇవన్నీ నేటి సమాజంలో దాదాపు అడుగంటిపోయాయి. ‘మనిషి జీవితం గాలి బుడగలాంటిది’. ఇది వేదాంతంలాగా అనిపించినా నగ్నసత్యం. ఏ మనిషి ఎంత కాలం బతుకుతాడో ఖచ్చితంగా ఎవ్వరూ లెక్కకట్టలేరు. ఇది అందరూ ఒప్పుకుని తీరే విషయం. మరలాంటప్పుడు మనుషులుగా మనం అవసరానికి మించిన డబ్బు సంపాదనకోసం ఎందుకు వెంపర్లాడుతున్నామో ప్రతి ఒక్కరం ఒక్కసారైనా ఆలోచించుకోవాలి. దీని గురించి చెప్పడానికి పురాణాలో, ఇతిహాసాలో, వేదాంతమో, ఆధ్యాత్మికమో కూడా అవసరం లేదు. అలాంటివి ప్రస్తావించినా బుర్రకెక్కే పరిస్థితులు కూడా లేవు. ఉదాహరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విషయాన్ని తీసుకుంటే.. ఆయన పదవీ కాలంలో  వేలకోట్ల రూపాయలు కూడబెట్టారన్నది ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆరోపించగా.. సిబిఐ ఏకంగా ఆయన కుమారున్ని కటకటాల్లోకి నెట్టింది. వీరందరి ఆరోపణలూ నిజమే ఐతే..! అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించగలిగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ సిరిసంపదలను చివరి దాకా అనుభవించే ప్రాప్తం లేకుండా ప్రమాదవశాత్తూ మరణించారు. ఇకపోతే బెంగుళూరులో ‘వైట్‌హౌస్’ను తలపించే భవంతి నిర్మించుకున్న ఆయన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజూ ప్రశాంతంగా ఆ శ్వేత సౌధంలో సేదదీరినట్లు కనిపించడం లేదు. మొన్నటిదాకా ఎండల్లో ఓదార్పు యాత్ర చేస్తే... ఇప్పుడు తనవారంతా  ఆయనున్న జైల్లో ఓదార్చే కార్యక్రమం. ఇది చెప్పడానికి వైఎస్‌నే ఎందుకు ఉదాహరణ అంటే.. అందరూ చెప్పిన పాతవిషయాన్నే మళ్ళీ చెబితే.. పాతచింతకాయ పచ్చడో.. కథలూ.. కాకరకాయలనో కొట్టిపారేస్తారు కాబట్టి. కరెంట్ ఇష్యూ ఐతే మరింత వేగంగా బుర్రకెక్కుతుందేమోనన్న చిన్న ఆశ.  ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ డబ్బు, తిండి, నిద్ర కావాలి. అవన్నీ ఎంతమేరకు కావాలో అంతే కావాలి.. అవసరానికి మించిందేదీ సుఖాన్నివ్వకపోగా కష్టాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి మితమే.. హితం..! సర్వేజనా సుఖినోభవంతు.

No comments:

Post a Comment