మనుషులు రానురాను రాక్షసుల్లా మారిపోతున్నారు. విద్యరాక ముందు వినయంగా ఉండి.. విద్య నేర్చాక వింతపశువుల్లా ప్రవర్తిస్తున్నట్టుంది. ఆధునికంగా ఎంత ఎత్తుకు ఎదుగుతున్నామో మనిషులుగా అంతకంత దిగజారిపోతున్నాం. మనుషుల రాక్షసత్వానికి తల్లిలాంటి ప్రకృతి విలవిల్లాడిపోతోంది. ప్రకృతి మూగరోధనను ఆలకించే మనసున్న మనుషులే కనిపించడం లేదు. ప్రకృతిలోని సమస్తానికి తానే అధిపతిని అన్నట్లుగా ఉంది మనిషి వ్యవహారం. మనిషి ఉనికికి ఎంత ప్రాధాన్యముందో.. ప్రకృతిలోని అన్నింటికీ అంతే ప్రాధాన్యముంది. భూమి, చెట్టు, నీరు, రాయితోపాటు సమస్త ప్రాణికోటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. వాటన్నిటికంటే మనలో ఉన్న ప్రత్యేకత తెలివి. దీనివల్ల గర్వం తలకెక్కకుండా హుందాగాను, మంచికి పాటుపడేలాగా వ్యవహిరించాలి. అదేదో గొప్పగానో, అధికారంగానో భావించడం చాలా ప్రమాదకరం. నేటి ఆధునిక యుగంలో సమాజం ముందు చూపు లేకుండా క్షణికానందాలకు, పైపైమెరుగులకే ప్రాధాన్యమిస్తోంది. దీనివల్ల ప్రకృతిలో సహజసిద్ధంగా లభించేవన్నీ అంగట్లో సరకుల్లాగా కొనుక్కుంటున్నారు. పైకి ఎంతందంగా కనిపించినా ప్లాస్టిక్ పువ్వు సహజమైన పువ్వు ల్లాగా సువాసన వెదజల్లలేదు. సహజమైనవాటిని నాశనం చేస్తూ.. ప్రత్యామ్నాయంగా ప్రతిఒక్క దాన్ని కొనుక్కుంటూనే ఉన్నారు. వ్యాయామం నుంచి నవ్వుని కొనుక్కునే విపరీత కాలం దాపురించి. అంగడికెళ్ళి పాల ప్యాకెట్ తేవడానికి కూడా బద్దకించే వారు.. జిమ్‌లకు వెళ్ళి డబ్బు పెట్టి మరీ వ్యాయామం చేస్తున్నారు. చేయాల్సిన అన్నిపనులకూ ఆటోలు, బైక్‌లు, బస్సుల మీద వెళ్ళడం... ఉదయం సాయంత్రం ఇంటిల్లిపాది వాకింగ్, జాగింగ్ చేయడం. సహజంగా జరగాల్సినవన్నీ వికృతంగా ఎందుకు జరుగుతున్నాయో ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా..? మొత్తం మనిషి జీవితచక్రమే అస్తవ్యస్తంగా మారిపోయింది. మనుషులు ఆనందంగా, హాయిగా బతకాలనుకోవడం తప్పు కాదు.. కానీ అది పరిసరాలను నాశనం చేసి మనం పొందేది సుఖం కాజాలదు. ఈవిధంగా తాత్కాలికంగా సుఖ భోగాలు అనుభవించినా భవిష్యత్తులో ప్రళయాలను ఎదుర్కోక తప్పదు. మనిషి ప్రతి విషయాన్ని వ్యాపార దృక్కోణంలోనే చూస్తున్నాడు. చెట్టు, పుట్ట, రాయి రప్పల గురించి మనుషుల రాతిహృదయాలకు అర్థం కాకపోయినా.. కనీసం ముద్దులొలికే పక్షులు, చిన్నిచిన్ని జంతువులను కూడా వ్యాపార వస్తువుల్లాగే చూస్తున్నామంటే మనల్ని మనుషులని పిలవాలా..? లేక రాక్షసులనాలా..? వన్యప్రాణుల్ని విచక్షణా రహితంగా వేటాడుతున్నారు. కొన్ని పక్షుల, జంతువుల మాంసాన్ని విందు, వినోదాలలో వడ్డించడం గొప్పతనంగా భావించే సంపన్నులు ఎందరో ఉన్నారు. జింక, కుందేలు, నెమళ్ళు ఎంతో చూడముచ్చటగా ఉండే చిరు ప్రాణులు. వాటిని ఎంతగా హింసించినా ప్రతిఘటించలేని సాధు ప్రాణులు. మయూరాలకు మన సంస్కృతిలోనూ, ప్రకృతిలోనూ ప్రత్యేక స్థానం ఉంది. అది మన జాతీయ పక్షి కూడాను. మయూరాలు పురి విప్పి నర్తించే సుందర, మనోహర దృశ్యాన్ని వర్ణించడానికి ఏ ప్రపంచంలోని ఏ భాషా సరిపోదు. అలాంటి మయూరాలను ఈకలకోసం మట్టుబెడుతున్నారు నేడు. సహజసిద్ధమైన అందాలను అమ్ముకుంటూ.. ఆసొమ్ముతో విపత్తులను కొని తెచ్చుకుంటున్నాం.
ఆలోచించే తెలివిలేని, వేరే విధంగా ఆహారాన్ని సంపాదించుకుని శక్తి యుక్తులులేని క్రూర మృగాలు మాత్రమే వేట మీద ఆధారపడతాయి. అన్ని విధాలా శక్తివంతులమైన మనుషులం క్రూరమృగాల బాటన నడవడం నాగరికమా..? అనాగరికమా..? మనకు మనం ఒక్కసారి ప్రశ్నిచుకోవాల్సిన తరుణం ఇది. వన్యప్రాణి చట్టాలు, అటవీ చట్టాలు ఉన్నా కూడా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ధనవంతులు, స్మగ్లర్ల దృష్టిలో అవన్నీ చిత్తుకాగితాలతో సమానం. విస్తారంగా చెట్లు పెంచే సంస్కృతి అంతరించిపోయింది. వృక్షాలుగా పెంచాల్సింది పోయి కుండీల్లో కుదించే పరిస్థితి వచ్చింది. ఇష్టారీతిగా గనులను తవ్వేస్తున్నారు. ఇవన్నీ ఎలాంటి విపత్కర పరిణామాలకు దారి తీస్తాయో ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. పూర్వం అనామకులు ఇంటికొచ్చినా మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొనుక్కుని తాగే దుస్థితిలో బతుకుతున్నాం. వీటన్నింటికి కారణం మనుషులు చేస్తున్న వికృత చేష్టలే. తల్లివంటి ప్రకృతిని బాధ పెట్టే ఏ బిడ్డా బాగుపడడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమనేది నానుడి.. కానీ మనకు పట్టుకోవడానికి ఆ ఆకులు కూడా మిగిలేలా లేవు.!
No comments:
Post a Comment