ప్రేమ, దయ, కరుణ, ఓర్పు, సహనం వీటన్నింటి కలయికే ‘స్త్రీ’. స్త్రీలను దేవతలుగా కొలిచినట్లు పురాణ, ఇతిహాసాలు చాటుతున్నాయి. ఇలాంటివన్నీ కాకమ్మకథలుగా కొట్టిపారేసినా.. రాణి రుద్రమ దేవి, ఝాన్సీలక్ష్మీభాయి వంటి వీర నారీమణుల విజయగాథలు ఎవరూ కాదనలేని చారిత్రక సత్యాలు. ఈ సృష్టిలో మహిళకు సాటిరాగల ప్రత్యామ్నాయమేదీ లేదు. తల్లిగా, చెల్లిగా, ఆలిగా ప్రేమ పంచడంలో ఆమెకు ఆమే సాటి. ఏ రూపంలోనైనా అమితమైన అభిమానం చూపే స్త్రీ.. ఇంటి పరువు కాపాడ్డానికి అదే స్థాయిలో శక్తి సామర్థ్యం, సహనాన్ని చూపే స్త్రీ, తేడా వస్తే అపర కాళికా శక్తిలా తన విశ్వరూపాన్ని ప్రదర్శించగలదు. అలాంటి స్త్రీ మూర్తిని మనం దేవతలా పూజించకపోయినా, కనీసం సాటి మనిషిగా కూడా చూడలేకున్నాం. మనుషులుగా మనం ఆధునికంగా ఎంత ఎత్తుకు ఎదిగామో... మానవత్వం విషయంలో అంతకు పదిరెట్లు దిగజారిపోతున్నాం. ఆడవాళ్ళు మగవారితో అన్నింటా సమానం.. వారికి సమాన హక్కులు అంటూ రాజకీయ నాయకులు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు వినడానికి చక్కగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం సున్నా. ఎక్కడిదాకో ఎందుకు.. ఆర్టీసి బస్సుల్లో ఆడవారికి కేటాయించిన సీట్లలో కూర్చున్న మగవారిని వాళ్ళు గద్దించి అడిగితేగానీ లేవడం లేదు.
మనిషి ఈ సృష్టిలోని ఏఒక్కదాన్నైనా కూడా నాశనం చేసి, తానొక్కడే మనుగడ సాగించాలనుకోవడం దుర్లభం.. దురాలోచన అవుతుంది. ఇది గ్రహించలేకనే తన జన్మకు కారణమైన, ప్రకృతిలోనూ, జీవనంలోనూ తనతో సమానమైన ఆడజన్మనే అంతం చేయడానికి కంకణం కట్టుకుంది నేటి సమాజం. కొందరు పురిటినుంచే కాటికి పంపుతుంటే.. మరి కొందరు కడుపులోనే కరిగించేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నాం.. ఎందుకిలా జరుగుతోందన్న విషయం ఏ ఒక్కరూ ఆలోచించడంలేదు. దీనివల్ల ఎంతటి దుష్పరిణామాలు ఎదురవుతాయో కూడా ఆలోచించడం లేదు. అనాదిగా మన సంస్కృతిలో ఆడవారంటేనే ఒక చులకన భావన పాతుకుపోయి ఉంది. నిజానికి చెప్పాలంటే ఆడమనిషి అంటే.. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన భావనలున్నాయి. కొందరికి విలాసం, భోగవస్తువుగా ఉంటే.. ఇంకొందరికి పనిమనిషి.. ఇప్పటికీ చాలా మందికి భార్య అంటే జీవిత భాగస్వామి కాదు, ఆమె ఒక బానిస. ఆడవారి పుట్టుకే మగవారితో పోలిస్తే చాలా భిన్నమైంది. వారి శరీరతత్వం ప్రత్యేకమైంది. ఆడవారిని ఆమడ దూరంలో ఉంచుతుండడానికి ఈ అంశాలు కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా ఆడపిల్లల సంఖ్య గణనీయంగా క్షీణించిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ౨౦౧౧సంవత్సరం సేకరించిన లెక్కల ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా మగవారితో పోల్చితే మహిళల నిష్పత్తి దారుణంగా పడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే దాదాపు ౧౮శాతం తేడా ఉంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్న చందంగా ఆడజాతి అంతమొందుతుండడానికి కూడా అన్నే కారణాలున్నాయి. ఈ పాపంలో సమాజంలోని అందరూ భాగస్వాములే. ఈ విషయంలో ప్రధానంగా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. మొదట ఆడపిల్లల్ని కనే విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడంలోనే విఫలమైందని చెప్పాలి. తర్వాత ఆడపిల్లలను పిండదశలోనే చంపేస్తుండడానికి స్కానింగ్ సెంటర్లదే ప్రముఖ పాత్ర. వీటిని కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమౌతూనే ఉంది. దేశంలోని ఏమూల చూసినా మహిళలకు భద్రత శూన్యం. పుట్టినప్పటినుంచి పెళ్ళయ్యే వరకూ వారికి ఏవిధమైన రక్షణ, భరోసా ఉండడం లేదు. ఇదే మన ఆంధ్రద్రేశ్‌లోనే.. ఉన్నతపాఠశాల్లో చదివే అమ్మాయిలకు బడిలో మరుగుదొడ్లు లేక, ఆరుబయటే బహిర్భూమికి వెళ్తున్న దుస్థితి ఎన్నో జిల్లాల్లో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితే మన పాలకుల, ప్రభుత్వాధికారుల పిల్లలకు ఎదురైనా కూడా ఇలాగే గుడ్లప్పగించి చూస్తూ ఊరుకుంటారా..? ఎవరి పిల్లలైనా పిల్లలే.. కోటీశ్వరులకైనా.. కూటికిలేని వారికైనా సిగ్గు సిగ్గే..! సిగ్గుమాలిన పనులు మనం చేస్తూ.. నిందలు మహిళలపైనా..? తప్పులు మనం చేస్తూ.. పసిప్రాయంలోనే ఆడ పిల్లలను శిక్షించడం న్యాయమా..? మహోన్నతమైన స్త్రీ మూర్తిని హత్య చేస్తున్న నేరంలో కుటుంబం, సమాజం, ప్రభుత్వం అందరూ దోషులే.. ఇప్పుడు చేస్తున్న తప్పులకు భవిష్యత్తులో కఠినశిక్ష అనుభవించక తప్పదు. ముందు తరాలవారు తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఆడపిల్లంటే నెత్తిమీద కుంపటి కాదు.. ఆణిముత్యం. ఆడ జన్మ అపురూప జన్మ..
No comments:
Post a Comment