ఆస్తికులు, నాస్తికులు అన్న తేడా లేకుండా ప్రజలంతా దేవుడి మీద భారమేసి బతకాల్సిన రోజులు దాపురించాయి. అసలు దేవుడు ఉన్నాడా..? లేడా...? అన్నది పశ్న్రే కాదిప్పుడు. ఉంటేగింటే కనీసం ఆదేవుడైనా డబ్బుకు అమ్ముడుపోకుండా ఉంటాడా..? అన్నదే అసలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష దైవాలుగా భావించే చట్టం, న్యాయాలకే సంకెళ్ళు పడుతుంటే.. సామాన్యుల గుండెల్లో పిడుగులు పడ్డట్టుంది. కాపాడాల్సిన దేవుళ్ళే కాటేస్తుంటే.. సామాన్యుల గోడు ఎవరికి చెప్పుకోవాలి..? న్యాయం కూడా అంగడి సరకైపోతే నిరుపేదల పరిస్థితి ఏంటి..? మన భారత దేశంలో బహిరంగంగా చెప్పుకోవడానికే ప్రజాస్వామ్యం.. తెరవెనుక నడుస్తున్నదంతా ‘ధనస్వామ్య’మే..! క్యాన్సర్ లాంటి లంచం ప్యూన్లు, అటెండర్ల స్థాయినుంచి ఐఎఎస్, ఐపిఎస్‌ల దాకా పాకింది. ఐతే సమాజంలోని అన్ని రంగాలూ భ్రష్టుపట్టిపోయినా.. న్యాయం మాత్రం నిప్పులాగే ఉందన్న నమ్మకం, ధైర్యం సామాన్య ప్రజల్లో ఇప్పటివరకూ సడలిపోలేదు. కానీ నేడు నిప్పుకూ చెదలు పట్టింది. న్యాయానికే సంకెళ్ళు పడ్డాయన్న విషయం వెన్నులో భయం పుట్టిస్తోంది. కాలికింది భూమి కంపించినట్లుంది. ఏకాలంలోనైనా సమాజం నీతి, న్యాయం, నమ్మకం అనే పునాదులమీదే కొనసాగుతుంది. ఆ పునాదులే బీటలు వారితే నిట్టనిలువునా కుప్పకూలిపోతుంది. రాజులకాలపు తీర్పులైనా, రచ్చబండ తీర్పులైనా అవే ప్రాతిపదికగా ఉండేవి.
న్యాయమూర్తులే కటకటాల్లోకెళ్తున్న పరిస్థితుల్లో జేబుదొంగలను, బంధిపోట్లను నిందించేందుకు, శిక్షించేందుకు ప్రజలకుగానీ.. పాలకులకుగానీ వీసమెత్తు అర్హత కూడా లేదు. ఎలాంటి నేరాలకు పాల్పడిన నేరస్థులైనా పరిస్థితుల ప్రభావంతోనే తాము ఇలా మారామని చెప్పడం సహజం. కూటికి లేకో.. ఉపాధిలేకో.. పనిచేయడానికి బద్దకించో దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడేవారినే ప్రజలు చీకొట్టడం, పోలీసులు అరెస్టు చేయడం ఎప్పట్నుంచో జరిగే తంతు. మరి కూటికి లేని కష్టాలో, కడుపు తరుక్కుపోయే బాధలో లేని ‘హైక్లాస్’ జనాలు కూడా కక్కుర్తిపడి దోచుకుంటుంటే.. వీరి ముందు చిల్లర దొంగల నేరాలు ఒక నేరమేనా..? ఈ కోణంలో చూస్తే.. జేబు కొట్టేవారికి, ఇంటికి కన్నం వేసేవారికి శిక్ష వేయడాన్ని చూస్తే.. చిన్న నేరం చేసిన వారిని పెద్ద నేరం చేసిన వారు శిక్షించినట్లే తోస్తుంది.. నీతి, నిజాయితి, మానవత్వం ఏ కోశానా లేకుండా.. ఇప్పుడు జైళ్ళలో ఉన్న వారిచ్చిన తీర్పులన్నింటిని ఏ ‘లెక్క’న అర్థం చేసుకోవాలో అంతు చిక్కదు. న్యాయమూర్తులు, ఐఎఎస్, ఐపిఎస్‌లంతా ఆకాశం నుంచి ఊడిపడ్డ అతీంద్రియ శక్తులు గలవారేమీ కాదు. వారు కూడా మనలాంటి మామూలు మనుషులే.. కాకపోతే ఆయా పదవులను అలంకరించే వారు.. నీతి, నిజాయితి, మానవత్వాలకు కట్టుబడి హుందాగా వ్యవహరిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఉంటారు. ప్రజాస్వామ్యం మాటున ‘ధనస్వామ్యం’ సాగుతుంటే.. పేదలు ఏ భరోసాతో బతకగలరు. ఈ లెక్కన ధనవంతుడు తంతే నోర్మూసుకోవాలి. ధనవంతుడు లేనివాడి ఆస్తులను ఆక్రమించుకుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలి. డబ్బున్నోడు ఏమైనా చేయగలడు, దేన్నైనా కొనగలడు. ఏ విలువలూ లేకుండా డబ్బుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే సమాజంలో పేదల మాన, ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా దేవుళ్ళను నమ్మేవారు, నమ్మని వారు ఉన్నారు. ఏదేమైనా ఏదోఒకరకమైన భయం, బాధలు ఉన్నవారే గుళ్ళు, గోపురాల చుట్టు తిరుగుతుంటారు. మొక్కులు ముక్కుకున్న వాళ్ళు వారివారి స్థోమతను బట్టి కానుకలు సమర్పిస్తుంటారు. మొక్కులకు దేవుడు కరుణించి కాపాడటం నిజమే గనుగ ఐతే ఇందులో కూడా పేదవాడికి భంగపాటు తప్పదు. కోట్లకు పడగలెత్తినవారు హత్యలు చేసి శిక్షపడకుండా చేస్తే దేవునికి వేలకోట్లు కానుకగా సమర్పిస్తానని మొక్కుకుంటే.. వేలకోట్ల అవినీతి కేసునుంచి బయటపడేలా చూస్తే దేవునికి వజ్రకిరీటం చేయిస్తాను స్వామి అని మొక్కుకుంటే.. ముఖ్యమంత్రిని చేస్తే వజ్రవైఢూర్యాలు సమర్పిస్తానని రౌడీ రాస్కెల్ మొక్కుకుంటే ఏమౌతుంది..? నిరుపేదలకు అన్యాయం.. ధనవంతులకు న్యాయం జరుగుతుంది. ఈ లెక్కన చూస్తే ‘స్వామి’నీ కొనగల ‘ధనస్వాములు’ ఎందరో ఉన్నారు. నెత్తిన రూపాయి బిళ్ళ పెడితే.. అర్ధరూపాయి విలువ కూడా చేయని బేవార్సుగాళ్ళెందరో అక్రమంగా కోటానుకోట్లు సంపాదించారు. ఇలాంటి వాళ్ళలో చాలామటుకు దేవుళ్ళకు లెక్కలేనంతగా ధన, కనక, వస్తురూపంలో కానుకలు సమర్పిస్తున్న వారూ ఉన్నారు. ఈ విధంగానైతే అక్రమంగా వేలకోట్లు సంపాదించినోడు దేవునికి కానుకగా వందలకోట్లు సమర్పించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అమ్ముడుపోవాలే గానీ ‘స్వాములను’ కొనడం ‘ధనస్వాములకు’ రూపాయితో పెట్టిన విద్య.
No comments:
Post a Comment